బైక్‌పై వెళ్తుండగా పోటెత్తిన వరద
గాలిస్తున్న జాలర్లు.. లభించని ఆచూకీ
వంతెన నిర్మాణం జాప్యంపై మాజీ మంత్రి జోగు ఫైర్
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర నుండి నైరుతి ప్రవేశించడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు (34) అనే యువకుడు తర్ణం వాగు ఉధృతిలో గల్లంతయ్యాడు. మంగళవారం సాయంత్రం మోటార్ బైక్ పై ఆదిలాబాద్ వచ్చి తిరుగు ప్రయాణంలో లక్ష్మీపూర్ వెళ్తుండగా చంద్రాపూర్ వెళ్లే జాతీయ రహదారి తర్ణం లోతట్టు అప్రోచ్ రోడ్డు గుండా వెళ్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరద ఉధృతికి దత్తు కొట్టుకుపోగా 1/2 కిలోమీటర్ దూరంలో బుధవారం మధ్యాహ్నం మోటార్ బైక్ ఆచూకీ లభించింది. వరదలో కొట్టుకుపోయిన లాండే దత్తు ఆచూకీ ఇంకా లభించలేదు. జాలర్లు గాలిస్తూనే ఉన్నారు.
వంతెన పూర్తికాకపోవడంతో ప్రమాదాలు
ఆదిలాబాద్ బోరజ్ నుండి చంద్రపూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు మంజూరై ఏడాది కావస్తున్నా ఇంతవరకు వంతెన పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వంతెన పనులు తక్షణం పూర్తి చేయాలని కోరారు. ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నా స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు.