డ్రోన్ మిస్ట్‌తో కాలుష్యం కట్టడి!

డ్రోన్ మిస్ట్‌తో కాలుష్యం కట్టడి!
నగరంలో వాయు నాణ్యత మెరుగుదలకు వీఎంసీ వినూత్న చర్యలు
కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా. జి.లక్ష్మీశ
విజయవాడ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వినూత్న చర్యగా డ్రోన్ల ద్వారా నీటి తుంపర్లు (మిస్ట్) వెదజల్లే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డా. జి.లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం ఉదయం మహాత్మా గాంధీ రోడ్, అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఈ కార్యక్రమాన్ని వీఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు వీఎంసీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటికే మిస్ట్ వాహనాల ద్వారా ప్రతిరోజూ నీటి తుంపర్లు వెదజల్లుతున్నామని, ఇప్పుడు డ్రోన్ల వినియోగంతో ముఖ్య కూడళ్లు, అధిక రద్దీ గల ప్రాంతాల్లో మరింత సమర్థవంతంగా మిస్ట్‌ను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.

డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయగలమని, దీంతో వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా ప్రజల ఆరోగ్య రక్షణకు తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా. కె.అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా. అన్నపూర్ణ, బయాలజిస్ట్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
