మేడారం జాతరలో సమస్యలు తలెత్తొద్దు…

  • దర్శనం ప్రశాంతంగా జరగాలి
  • భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగొద్దు
  • తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌ స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర‌
  • ఎక్క‌డ లోటుపాట్లు లేకుండ నిర్మాణాలు చేప‌ట్టాలి
  • రాష్ట్ర దేవాదాయ,అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
  • సచివాలయంలో భ‌క్తుల క్యూలైన్ల బ్రాస్ గ్రిల్స్ నమూన ప‌రిశీల‌న

ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : స‌మ్మ‌క్క – సార‌క్క మేడారం జాత‌ర తెలంగాణ ఆత్మగౌర‌వ ప్ర‌తీక అని రాష్ట్ర దేవాదాయ, అటవీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ ఉద్ఘాటించారు. యావ‌త్ ప్ర‌పంచం ఈ జాత‌ర కోసం ఎదురు చూస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ జాత‌ర వేదిక… ప్ర‌పంచం న‌లుమూలలూ చాటిచెప్పే గొప్ప ఆథ్యాత్మిక కేంద్రంగా మేడారం విల‌సిల్లుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

స‌మ్మ‌క్క‌- సారల‌మ్మ పోరాట గాథ‌, చరిత్ర విశ్వ‌వ్యాప్త‌మవుతున్న‌ద‌ని చెప్పారు. సమ్మక్క సారక్క మేడారం జాత‌రలో అమ్మవారి గద్దెల చుట్టూ భ‌క్తులు క్యూలైన్ల‌లో సాఫీగా వెళ్ళేందుకు త‌యారవుతున్న బ్రాస్ గ్రిల్స్ నమూనాను తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్‌లో శ‌నివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమ‌తి కొండా సురేఖ పరిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఆల‌య నిర్మాణ నిర్వాహ‌కుల‌తో స్వయంగా సంభాషించారు. గిరిపుత్రుల ఆరాధ్య దేవ‌తల ఆశీస్సులు తీసుకునేందుకు… మొక్కులు చెల్లించుకునేందుకు… ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించి త‌న్మ‌య‌త్వం చెంది పునీతుల‌య్యేందుకు కోట్ల‌లో భ‌క్తులు, ప్ర‌జ‌లు జాతరకు వ‌స్తార‌ని, అందుకు త‌గిన విధంగా బ్రాస్ గ్రిల్స్ నాణ్య‌మైన‌వి ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌నల మేర‌కు మేడారంలో పెద్ద ఎత్తున శాశ్వ‌త ప‌నులు చేప‌డుతున్నామ‌న్నారు. ఆల‌య నిర్మాణ సంబంధిత నిర్వాహ‌కులు మంత్రి సురేఖకి గ్రిల్స్ చూపించేందుకు బ్రాస్ గ్రిల్స్ ను స్వ‌యంగా స‌చివాల‌యానికి తీసుకొచ్చామ‌ని అక్క‌డే ఎదురైన మీడియా ప్ర‌తినిధులకు చెప్పారు.

వాటి ఉప‌యోగాన్ని మంత్రితో పాటు అక్క‌డున్న వారంద‌రికీ వివ‌రించారు. దాదాపు రెండు వంద‌ల ఏండ్ల పాటు మ‌న్నికగా ఉండే ఉద్దేశంతో ఈ గ్రిల్స్ ను పటిష్టంగా త‌యారు చేయించిన‌ట్టు చెప్పారు. వీటిని స‌మ్మ‌క్క సార‌క్క, జంప‌న్న గ‌ద్దెల చుట్టూ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ఈ గ్రిల్స్ ను గ‌ద్దెల వద్దనున్న గ్రైనెట్స్ కి సుమారు ఆరు మీట‌ర్ల లోతు దింపి నిల‌బెడతార‌ని నివేదించారు. అయితే, ఏర్పాట్ల విష‌యంలో ఏ విధంగానూ రాజీ ప‌డొద్ద‌ని మంత్రి సురేఖ చెప్పారు. మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్ర‌భుత్వం వెళుతుంద‌ని, ఈ నేప‌థ్యంలో మేడారం జాతరలో భక్తుల రద్దీ నిర్వహణను మెరుగు పరచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

భక్తుల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జాత‌ర‌కు మూడు నెల‌ల ముందు నుంచే ఓ ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతున్నామ‌ని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ వారిని అభినందించారు.

Leave a Reply