షాపింగ్ స్కామ్‌లకు బలి కాకండి.. ఫోన్ పే

హైద‌రాబాద్ : ఆన్‌లైన్ షాపింగ్‌ వల్ల కస్టమర్లు తమకు, తమ ప్రియమైన వారికి ప్రోడక్ట్‌లను కొనుగోలు చేసే విధానం నిజంగానే మారిపోయింది. అయితే, దురదృష్టవశాత్తూ ఈ సౌలభ్యానికి మరో వైపు చీకటి కోణాలు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ మోసం వల్ల భారీ ఆర్థిక నష్టాలు లేదా డేటా దొంగతనం వంటి దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. డబ్బు బదిలీ అయిన తర్వాత రికవరీ చేయడం దాదాపుగా అసాధ్యం. అంతేకాకుండా, వీటిలోని కొన్ని స్కామ్‌ వెబ్‌సైట్లు యూజర్ల వ్యక్తిగత వివరాలను, వారి క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని దుర్వినియోగపర్చవచ్చు.


మోసగాళ్లు సోషల్ మీడియాలో నకలు (డూప్లికేట్) లేదా నకిలీ ప్రొఫైళ్లను సృష్టిస్తారు. వారు సాధారణంగా ప్రసిద్ధ విక్రేతలు లేదా బ్రాండ్‌లుగా నటిస్తూ, నమ్మశక్యం కాని “ప్రత్యేకమైన” డిస్కౌంట్లను అందిస్తారు. వారు దొంగిలించిన ప్రోడక్ట్‌ చిత్రాలు, నకిలీ యూజర్ల అభిప్రాయాలను (టెస్టిమోనియళ్లను) ఉపయోగిస్తారు, ముందస్తు పేమెంట్ల కోసం, అంటే UPI లేదా బ్యాంక్ ద్వారా పే చేయమని ఒత్తిడి తీసుకొస్తారు, తీరా పేమెంట్ అయ్యాక మాయమైపోతారు.


నకిలీ వెబ్‌సైట్లను తరచుగా ప్రామాణికమైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను పోలి ఉండేలా మోసగాళ్లు రూపొందిస్తారు. వాటి డొమైన్ పేర్లు (xyz.inకు బదులుగా xYz.in వంటివి వాడుతారు) కూడా దాదాపుగా నిజమైన సైట్‌ల డొమైన్ పేర్లను పోలి ఉండవచ్చు, అలానే షాపింగ్ చేసే వాళ్లను ఆకర్షించడానికి నమ్మశక్యం కాని చౌకైన ఆఫర్లను అందిస్తారు. ఆయా వెబ్‌సైట్లలో ఉండే అసురక్షితమైన పేమెంట్‌ గేట్‌వేల వల్ల యూజర్ల బ్యాంక్ వివరాలు ప్రమాదంలో పడతాయి.

కస్టమర్లు సాధారణ హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకుంటే, ఆన్‌లైన్ షాపింగ్ మోసాల బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చు. అసలు ఈ డీల్ నిజమేనా అని అనిపించే నమ్మశక్యం కాని డిస్కౌంట్లను, అలాగే ముందస్తు పేమెంట్లను మాత్రమే అనుమతిస్తామని నొక్కి చెప్పే వెబ్‌సైట్లు లేదా యాప్‌లను ప్రధాన హెచ్చరికలుగా పరిగణించాలి. పేలవమైన వ్యాకరణం, అస్పష్టమైన చిత్రాలు లేదా బ్రేక్ అయిన లింక్‌లు మోసానికి ప్రధాన సూచికలు కాబట్టి, వెబ్‌సైట్ డిజైన్లలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయా లేదా అని చూడటం కూడా ముఖ్యం. చట్టబద్ధమైన వ్యాపారాలు అనేవి స్పష్టమైన రిటర్న్/ఎక్స్‌ఛేంజ్ పాలసీలను, అలానే ప్రతిస్పందించే కస్టమర్ సర్వీస్‌ను అందిస్తాయి, కాబట్టి కస్టమర్ సహాయ విభాగం లేని వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలి. చివరగా, సోషల్ మీడియాలో బ్లూ టిక్‌లు లేదా వాస్తవ ఫాలోవర్ల సంఖ్యను యూజర్లు చెక్ చేయాలి.

మోసగాళ్లు మరింత అధునాతన పద్ధతుల్లో మోసగించడం నేర్చుకుంటున్నప్పటికీ, యూజర్లు తమను తాము రక్షించుకోవడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు. యూజర్లు ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండటానికి ఫోన్‌పే సైబర్ భద్రతా నిపుణులు కొన్ని కీలకమైన చిట్కాలను తెలిపారు. ప్రోడక్ట్‌ను కొనుగోలు చేసే ముందు వెబ్‌సైట్ లేదా యాప్‌ను యూజర్లు వెరిఫై చేయాలి, అలానే విక్రేత లేదా వెబ్‌సైట్‌ గురించి జాగ్రత్తగా, నిశితంగా పరిశోధించాలి. వెంటనే Google లో సమీక్షలను సెర్చ్ చేస్తే స్కామ్‌లు బయటపడొచ్చు. యూజర్లు పేమెంట్ వివరాలను ఎంటర్ చేసే ముందు URLలో https://, ప్యాడ్‌లాక్ సింబల్‌ ఉన్నాయో లేవో చూసి వెబ్‌సైట్ భద్రతను కూడా చెక్‌ చేయాలి. మంచి పేరు ప్రఖ్యాతులున్న ప్రసిద్ధ ఇ-కామర్స్ యాప్‌లు, వెబ్‌సైట్లకే కట్టుబడి ఉండటం ముఖ్యం, ఎందుకంటే ఇవే విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లు. సోషల్ మీడియాలో చూసే ప్రతి పేజీ లేదా ప్రకటనలను గుడ్డిగా నమ్మకూడదు, ఆ అకౌంట్ ప్రామాణికతను ఖచ్చితంగా వెరిఫై చేయాలి. ఎవరైనా యూజర్‌ ఏదైనా అనుమానాస్పద చర్య, ఘటనను ఎదుర్కొంటే, దాన్ని సంబంధిత డొమైన్ల దృష్టికి తీసుకెళ్లాలి, అలానే ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో సైబర్ ఫిర్యాదును నమోదు చేయాలి.

ఫోన్‌పేలో మీరు అలాంటి స్కామ్‌కు గురైతే, వెంటనే ఫోన్‌పే యాప్‌లో లేదా కస్టమర్ కేర్ నంబర్లు 080–68727374 / 022–68727374కు కాల్ చేసి లేదా ఫోన్‌పే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అటువంటి స్కామ్‌ల గురించి ఫిర్యాదు చేయవచ్చు. చివరగా, మీరు సమీపంలోని సైబర్ క్రైమ్ సెల్‌కు వెళ్లి మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/కు వెళ్లి, ఆన్‌లైన్‌లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు లేదా 1930 కు కాల్ చేసి సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు లేదా వాట్సప్‌ మోసం గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని చక్షు సౌకర్యంలో సమాచారమివ్వడం ద్వారా మీరు టెలికమ్యూనికేషన్స్ శాఖను (DOTను) కూడా సంప్రదించవచ్చు. మీరు ఫోన్‌పే ఫిర్యాదుల పరిష్కార విభాగంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Leave a Reply