- దివ్యాంగుడికి హామీ ఇచ్చిన కలెక్టర్ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : అంగవైకల్యం కారణంగా.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాన్ని ఓదారుస్తూ, అవసరమైన సహాయం అందిస్తామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హామీ ఇచ్చారు.
భీమవరం మండలం గూట్లపాడు గ్రామానికి చెందిన చెన్నా గౌరీ శంకరరావు, కుటుంబ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం వద్ద వేచి ఉండగా, వీల్‌చైర్‌లో ఉన్న శంకరరావు పరిస్థితిని గమనించిన కలెక్టర్ నాగరాణి స్వయంగా వారిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శంకరరావు మాట్లాడుతూ… తనకు పుట్టుకతో అంగవైకల్యం ఉన్నదని, ప్రస్తుతం నెలకు రూ.6,000 దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నానని తెలిపారు. 2020లో పక్షవాతానికి గురై కాలు, చెయ్యి పనిచేయకుండా పోయాయని, వైద్యం చేయించుకోవడానికి ఎలాంటి ఆర్థిక ఆధారం లేక కుటుంబ జీవనం దారుణంగా మారిందని చెప్పారు. మంచానికి పరిమితమైన వారికి అందించే నెలకు రూ.15 వేల పెన్షన్ మంజూరు చేయాలని వినతిపత్రం ద్వారా కలెక్టర్‌ను వేడుకున్నారు.
దీనిపై కలెక్టర్ నాగరాణి స్పందిస్తూ… రూ.15 వేల పెన్షన్ మంజూరుకు సంబంధించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో గీతాబాయికి ఆదేశాలు జారీ చేశారు.
అదే విధంగా, శంకరరావు కుమార్తె సుమపద్మినిని ఓదారుస్తూ — శ్రద్ధగా చదువుకుంటే ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

