COLLECTOR | ప్రతిభకు వైకల్యం అడ్డు కారాదు

COLLECTOR | ప్రతిభకు వైకల్యం అడ్డు కారాదు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : వైకల్యమనేది మనిషికే కాని మనసుకు కాదని, ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోతుందని క్రీడలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతులు సకలాంగులకు దీటుగా సత్తాను చాటాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా (NTR Distt) విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలోని స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలలను కలెక్టర్ ప్రారంభించారు. తొలుత జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (District Collector) మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన తోడ్పాటును అందిస్తే ఎటువంటి విజయాలనైన సొంతం చేసుకుంటారని, ఇటీవల జరిగిన అంధుల తొలి టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో మన దేశం విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. భారత్ జట్టులో స్థానం పొంది విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్లు టి.దీపిక కరుణ కుమారిలను ఆదర్శంగా తీసుకుని క్రీడలలో రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతిభావంతులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. వైకల్యాన్ని గురించి ఆలోచించక క్రీడాలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతుడు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని కలెక్టర్ కోరారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేయతగా భావించాలన్నారు.

సమాజంలో అన్ని రంగాలలో రాణించేలా విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విభిన్న ప్రతిభావంతుల (Talented) వయోవృద్ధులు సహకార కార్పొరేషన్ చైర్మన్ జి. నారాయణ స్వామి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు సకలాంగులతో సమానంగా జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేలా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ప్రభుత్వం అనులు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిపుచ్చుకుని రాణించడం ద్వారా మనోధైర్యాన్ని పెంచుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలోనూ విజేతలుగా నిలిచేలా అధికారులు విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలని తెలిపారు.

విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు (For the elderly) అవసరమైన సహకారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు వి. కామరాజు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు జిల్లా స్థాయిలో జూనియర్ సీనియర్ మహిళలు, పురుషుల విభాగాలలో చెస్, క్యారమ్స్, సాఫ్ట్ బాల్, వాలీబాల్, రన్నింగ్, ట్రై సైకిల్ రేస్, షాట్పుట్, డిస్టర్స్ త్రో వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 300 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు పోటీలలో పాల్గొంటున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పర్యవేక్షకులు ప్రశాంతి, విభిన్న ప్రతిభావంతులు బాలికల వసతి గృహం, మెడోన్నా మూగ బదిరల కళాశాల, మానసిక వికాస కేంద్రం, ప్రేమ వికాస్, అంకిత చారిటబుల్ ట్రస్ట్, సెయింట్ అన్ని సొసైటీ ప్రేమ్ నికేతనని స్కూల్, సత్యసాయి చేయూత సొసైటీ, జీవజ్వోతి రెసిడెన్సిల్ స్కూల్, శ్రీ విద్య సోషల్ సర్వీస్ స్కూల్, శ్రీమతి మెర్ల రామమ్మ మెమోరియల్ ట్రస్ట్, శిరిష రహబిలిటీషన్ సెంటర్, కెడివి ట్రస్ట్, విజయ మేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ బ్లైండ్లకు చెందిన క్రీడాకారులు పలు క్రీడా పోటీలలో పాల్గొన్నారు.

