Bellampally | పట్టించుకునే వారేరీ?

Bellampally | పట్టించుకునే వారేరీ?
- వన్ టౌన్ ప్రధాన రహదారిపై మురికి ప్రవాహం
బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ) : బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై పరిస్థితి దారుణంగా ఉంది. ప్రధాన రహదారిపై ఏకధాటిగా ప్రవహిస్తున్న దుర్గంధపు మురుగు నీరు, ఆ మార్గంలో ప్రయాణించే వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ రోడ్డు గుండా వెళ్లే ప్రతిఒక్కరూ ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అయినా, పట్టణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాల్సిన మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గాలు ఈ సమస్యను ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆంళోన వ్యక్తం చేస్తున్నారు.
మురికి కాలువల నీరు రోడ్డుపైకి…
పోలీస్ స్టేషన్ ఎదురుగా, రావి చెట్టు వైపు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాస గృహాల నుంచి వచ్చే మురుగు నీరు కాలువల్లో నిండిపోయి, రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీనికి ప్రధాన కారణం మున్సిపాలిటీ అధికారులు చాలా కాలంగా కాలువలను శుభ్రం చేయించకపోవడం.
కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా నీటి ప్రవాహం నిలిచిపోయి, దుర్గంధభరితమైన నీరు రోడ్డుపైకి ఉప్పొంగుతోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమస్యకు తోడు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందున్న యువ సంఘటన్ పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి కూడా అధ్వానంగా మారింది. ఇక్కడ నివాస గృహాలకు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు లీకవడంతో ఆ నీరు రోడ్డుపై చేరి, రోడ్డు అంతా బురదమయంగా, గుంతలమయంగా తయారైంది.పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సైతం ఈ బురద గుంటల గుండానే నడవాల్సి వస్తోంది.
ఈ రెండు ప్రధాన రహదారులు 28, 29 వార్డుల పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్ల పదవీ కాలం ముగియడంతో, వార్డుల్లో కేటాయించిన వార్డు ఆఫీసర్లు కానీ, ఈ రోడ్డు గుండా తరచూ ప్రయాణించే వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
