Devotional | ప్రజా శ్రేయస్సు కోరుతూ అనకాపల్లి ఎం.పీ మహా శాంతి హోమం
విశాఖ రూరల్ ( ఆంధ్రప్రభ ):రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ప్రజా శ్రేయస్సు కోరుతూ ఆదివారం వారి స్వగృహంలో కుటుంబసమేతంగా సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధారణలో సుదర్శన, లక్ష్మీ నరసింహ యాగం, లక్ష్మీ గణపతి యాగం, మృత్యుంజయ యాగం, మహా శాంతి హోమం నిర్వహించారు.
ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా విశ్వసించే రమేష్ శ్రీదేవి దంపతులు ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు.
ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు . కుమారుడు రీత్విక్,కోడలు పూజ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ లోకకళ్యాణార్థం ప్రతిసంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా నివాసంలో కుటుంబసమేతంగా మహా శాంతి హోమం ఘనంగా నిర్వహించామన్నారు.
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఘనంగా వర్ధిల్లాలని, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్ధించినట్లుగా పేర్కొన్నారు.