Devotional | మానస సరోవర్ టూర్ …యాత్రకు సన్నాహాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
చైనా, భారత్ మధ్య మెరుగవుతున్న సంబంధాలు
సముద్ర మట్టానికి 22వేల అడుగుల ఎత్తులో కైలాస శిఖరం
చార్ధామ్, అమర్‌నాథ్ కంటే దీనికే ఇంపార్టెన్స్
అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తున్న హిందువులు
తీర్థయాత్రకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కంపల్సరీ
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్:
భారతీయులు ప్రతిష్ఠాత్మకంగా భావించే కైలాస మానస సరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి భారత్-చైనా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కారణంగా కైలాస మానస సరోవర్ యాత్ర ఆగిపోయింది. ఆ తర్వాత.. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఇన్నేళ్ల పాటు ఈ పవిత్ర యాత్రను నిర్వహించ లేదు. అయితే.. కొన్నేళ్లుగా భారత్-చైనా మధ్య నెలకొన్న వివాదాలు.. ఈ మధ్యకాలంలో తగ్గుముఖం పడుతున్నాయి. దాంతో.. రెండు దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే.. భారత్-చైనా మధ్య కీలక నిర్ణయాలు కొలిక్కి వచ్చాయి. రాబోయే వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. అయితే.. హిమాలయాల్లో కొలువైన కైలాస పర్వతానికి ఎలా చేరుకోవాలి? సాక్షాత్తూ ఆ శివుడే కొలువై ఉన్నాడని నమ్మే ప్రదేశాన్ని ఎలా దర్శించుకోవాలి? దేవతలు స్నానమాచరిస్తారని భావించే.. పవిత్ర మానస సరోవర్ సరస్సుకి ఎలా చేరుకోవాలి? అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అడుగడుగునా ఆధ్యాత్మికత..
చార్ ధామ్ యాత్ర, అమర్‌నాథ్ యాత్రల మాదిరిగానే కైలాస మానస సరోవర్ యాత్రకు కూడా దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఇది హిందువులు, బౌద్ధులు, జైన భక్తులకు అత్యంత ప్రముఖమైన, గౌరవ ప్రదమైన యాత్ర. హిమాలయాల్లో నెలవైన కైలాస పర్వతం.. ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మొత్తం భూమికి ఆధ్యాత్మిక కేంద్రంగా కైలాస పర్వతం ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యాత్రికులు, యోగులు దీన్ని సందర్శిస్తారు. పూజిస్తారు. ముఖ్యంగా ఆ పరమశివుని మోక్షానికి అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణిస్తారు. కైలాస పర్వతం కొలువైన ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుందని నమ్ముతారు.
..అది సాధారణ శిఖరం కాదు..
భారత ప్రజలకు కైలాస పర్వతం ఓ సాధారణ శిఖరం కాదు. ప్రధానంగా హిందువులంతా కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. శివపార్వతులు అక్కడే ఉంటారని నమ్ముతారు. అందుకోసమే.. హిందూ మతంలో కైలాస పర్వతానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది. జైన మతం ప్రకారం తొలి జైన తీర్థంకరుడు మోక్షం పొందిన ప్రదేశం కైలాసం. బౌద్ధమతంలో కైలాస పర్వతంపైనే బుద్ధుడు నివసిస్తుంటాడని నమ్ముతారు. టిబెట్‌లో బౌద్ధమతానికి పూర్వం ఉన్న బాన్ మతం కూడా.. ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తికి స్థానం అని నమ్ముతుంది. అందుకోసమే.. కైలాస పర్వతాన్ని నాలుగు మతాల వారు అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు.
సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో..
సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో ఓ రాతి పిరమిడ్‌లా కనిపించే శిఖరమే కైలాస పర్వతం. ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ పర్వతం అచ్చం శివలింగంలా కనిపిస్తుంటుంది. ఈ పర్వతం.. స్వయంభువు అని నమ్ముతారు. ఈ పర్వతాన్ని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులు అక్కడ కైలాస పరిక్రమ్ ఆచారాన్ని పాటిస్తారు. ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణనే కైలాస పరిక్రమ్‌గా పిలుస్తారు. ఈ ప్రదక్షిణ పూర్తి చేసేందుకు 2 నుంచి 3 రోజులు పడుతుంది.
అదృష్టం, దేవుని ఆశీస్సులు లభిస్తాయని..
కైలాస పరిక్రమ్ పూర్తి చేయడంతో జీవితంలో అదృష్టం, ఆ దేవుని ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. దీన్ని ఆనుకొనే మానస సరోవరం సరస్సు ఉంటుంది. ఇది.. స్వచ్ఛతకు, మోక్షానికి మూలంగా పరిగణిస్తారు. అందులో.. సాక్షాత్తూ దేవతలు వచ్చి స్నానమాచరిస్తారనే నమ్మకం ఉంది. అందుకే.. ఈ కైలాస మానస సరోవరం యాత్రకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర యాత్రని.. అంతిమ తీర్థయాత్రగా పరిగణిస్తారు. ఈ యాత్ర జ్ఞానోదయం కలిగిస్తుందని, కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మనస్సుని మారుస్తుందని చెబుతారు.
పాస్ పోర్ట్ కంపల్సరీ.. పెద్ద మొత్తంలో ఖర్చు..
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కచ్చితంగా ఉండాలి. ఈ జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలోని వారై ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ 27 కంటే తక్కువ కలిగి ఉండాలి. శారీరంగా ద్రుఢంగా, ఆరోగ్యవంతులు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యాత్రకు అర్హులు. కైలాస మాన సరోవర్ యాత్రను పూర్తి చేయాలంటే.. ఒక్కో భారతీయుడికి లక్షా 40 వేల నుంచి లక్షన్నరకు పైనే ఖర్చు అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులన్నీ కలిపి ఉంటాయి. యాత్రకు వెళ్లే వారికి చైనా వీసా కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది.
చైనా ప్రభుత్వానికే ₹50 వేలు చెల్లించాలి..
మెడికల్ టెస్టులతో పాటు టిబెట్‌లో బస చేసేందుకు, ప్రయాణాలకు, చైనా ప్రభుత్వానికి భారీగానే చెల్లించాలి. కేవలం వీటికే ₹50 వేలకు పైగా ఖర్చవుతుంది. యాత్రికుల లగేజీలు తీసుకెళ్లే పోర్టర్స్ కోసం, గుర్రాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా.. మొత్తం కలిపి దాదాపు లక్షన్నర దాకా కైలాస మానస సరోవర్ యాత్రకు ఖర్చవుతుందనే అంచనా ఉంది.
సరిహద్దుల్లో ప్రతిష్టంభనకు బ్రేక్..
కరోనా తర్వాత తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో.. రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదం ముగిసిపోయింది. దాంతో సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్టంభనకు బ్రేక్ పడింది. ఇప్పటికే రెండు దేశాలకు చెందిన సైన్యాలు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయాయ్. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలైంది. గతేడాది భారత ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ రష్యాలోని కజాన్‌లో భేటీ అయ్యారు. ఆ సమావేశం తర్వాతే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనడం మొదలైంది. అందులో భాగంగానే కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభించాలని భారత్-చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక.. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు కూడా సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.