అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: మంత్రులు
జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం మంగళవారం శ్రీనగర్ కాలనీలోని జీహెచ్ఎంసీ పార్క్‌లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu), మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ప్రచార సమయంలో నాయకులు మాట్లాడుతూ… హైదరాబాద్ మహానగర అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులు (Development projects), సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. భవిష్యత్తులో మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, సమగ్ర నగర అభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో పనిచేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తూ, జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్న నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.


