మరోమారు ఆశీర్వదించండి…

  • దేవారంపల్లిని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతా
  • గ్రామ సర్పంచ్ అభ్యర్థి బచ్చంగారి మనీలా నరహరి రెడ్డి

చేవెళ్ల, ఆంధ్రప్రభ : గత ఐదేళ్లుగా గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశాను… మరోసారి ఆశీర్వదించండి… దేవారంపల్లిని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని సర్పంచ్ అభ్యర్థి బచ్చంగారి మనీలా నరహరి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో దేవారంపల్లి గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచారానికి గ్రామస్తులు, మహిళలు, యువత, వృద్ధులు భారీగా హాజరై స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. బొట్టు పెట్టి, మంగళహారతులతో ఆమెకు ఆశీర్వాదాలు అందించారు. గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు, మహిళలు, యువతి–యువకులు, వృద్ధులందరి నుంచి ఆమెకు విశేష ఆదరణ లభించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన భర్త నరహరి రెడ్డి గత ఐదేళ్లు సర్పంచిగా పనిచేస్తూ గ్రామాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుపుతానని తెలిపారు.

తాగునీరు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పూర్తి అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, పొలాలకు వెళ్లే రోడ్లు – ఇవన్నింటినీ మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ దేవారంపల్లిని రోల్ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply