కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్ ప్యారడైజ్ నుండి డైరీ ఫార్మ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్యారడైజ్ కూడలి నుండి బోయిన్‌పల్లి మీదుగా డైరీ ఫార్మ్ వరకు నిర్మించనున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు దాదాపు తొమ్మిది నెలలు సాగనున్న కారణంగా, ట్రాఫిక్ మళ్లింపు చర్యలను పోలీసులు అమలు చేస్తున్నారు.
బాలమ్రాయి రాజీవ్ గాంధీ విగ్రహం కూడలి నుండి బాబు జగ్జీవన్‌రామ్ కూడలి వరకు ఇరువైపులా రహదారి మూసివేసి పనులు ప్రారంభించారు. సుచిత్ర, బాలానగర్, న్యూ బోయిన్‌పల్లి ప్రాంతాల నుండి పంజాగుట్ట, ట్యాంక్ బండ్ వైపుకు వెళ్లే వాహనాలను డైమండ్ పాయింట్, ఎస్బీఐ కూడలి, తివోలీ థియేటర్ కూడలి వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు.
అలాగే ట్యాంక్‌బండ్, రాణిగంజ్, రసూల్‌పురా, బేగంపేట, పంజాగుట్ట నుండి తాడుబండ్ వైపుకు వెళ్లే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహ కూడలి వద్ద నుంచి అన్నానగర్ మీదుగా మళ్లిస్తున్నారు. అన్నానగర్, బాలమ్రాయి ప్రజలు అంతర్గత రహదారులను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
అయితే ఒక్కసారిగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రావడంతో చాలామంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలపై తగిన అవగాహన లేకపోవడం వల్ల పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలను మరింత విస్తరించి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

