Deported | అమెరికా నుంచి వస్తున్న రెండో బ్యాచ్
వలసదారులు వాపస్
119 మందితో బయలుదేరిన సీ64 విమానం
వారిలో అత్యధికులు పంజాబీవాసులే
నేటి రాత్రి అమృతసర్‌లో విమానం ల్యాండింగ్
అన్ని విమానాలు పంజాబ్ రావడమేనా
కావాలని తమను బద్‌నాం చేసే యత్నాలు
కేంద్రం తీరుపై సీఎం భగవంత్ గరంగరం
శాన్ ఫ్రాన్సిస్కో, ఆంధ్రప్రభ: అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లుగానే అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయుల్ని స్వదేశానికి పంపేస్తున్నారు. ఇప్పటికే 104 మంది వలసదారులతో కూడిన విమానాన్ని భారత్‌లోని అమృత్ సర్‌కు పంపిన ట్రంప్.. శనివారం మరో విమానాన్ని సిద్దం చేశారు.. ఈసారి సీ64 విమానం 119 మంది వలసదారులతో ఆమెరికా నుంచి బయలుదేరింది. ఇందులో 67మంది పంజాబ్ వారే ఉన్నారు. అలాగే హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్‌కు చెందిన 8 మంది, యూపీకి చెందిన ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన తలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌కు చెందిన చెరొకరు ఉన్నారు. ఇప్పుడు ఆ విమానం ఇవాళ అమృత్ సర్‌లో ల్యాండ్ కాబోతోంది. ఇక, తాజాగా అమెరికాలో ట్రంప్‌ను కలిసిన భారత ప్రధాని మోదీ వలసలపై చర్చలు జరిపారు. అయితే.. అక్రమ వలసల విషయంలో ట్రంప్ వైఖరితో మోదీ కూడా ఏకీభవించారు. దీంతో ట్రంప్ పని మరింత సులువైంది. భారత్‌కు పంపాల్సిన వలసదారుల్ని వేగంగా గుర్తించి స్వదేశానికి పంపేయాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చేశారు.
మా దగ్గరే ఎందుకు?.. పంజాబ్ సీఎం అసహనం
అమెరికా నుంచి వస్తున్న వారిలో ఎక్కువ మంది పంజాబీలు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. అమెరికా నుంచి వలసదారులతో వస్తున్న విమానాల్ని ఇలా అమృత్ సర్‌లో దింపడం ద్వారా తమ రాష్ట్రం పేరు చెడగొడుతున్నారని సీఎం భగవంత్ సింగ్ మాన్ కేంద్రంపై విమర్శలకు దిగారు. అయితే.. తమ రాష్ట్రానికి చెందిన వలసదారుల్ని మాత్రం ఎలాంటి వివక్ష లేకుండా ఆహ్వానిస్తామని కూడా మాన్ ప్రకటించారు. వారిని గౌరవంగా స్వర్ణదేవాలయానికి తీసుకెళ్లి అనంతరం పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే.. తమ రాష్ట్రం పరువు తీసేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. అమెరికా విమానాన్ని ఢిల్లీ లేదా అహ్మదాబాద్‌లో ల్యాండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కూడా ఈ వాదనను సమర్థిస్తోంది. అక్రమ వలసలు జాతీయ సమస్య అని.. దీన్ని పంజాబ్‌కు మాత్రమే పరిమితం చేయొద్దని కేంద్రానికి కాంగ్రెస్ లీడర్లు సూచిస్తున్నారు.