తెలంగాణ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై, రాష్ట్రంలో నిర్వహించిన బీసీ కులగణన విధానాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ – దాదాపు వందేళ్ల తర్వాత తెలంగాణలో బీసీ కులగణన సర్వే చేపట్టినట్లు చెప్పారు. త్వరలో జరగనున్న దేశవ్యాప్త జనగణనలో తెలంగాణ కులగణన ఫలితాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంతో పాటు తెలంగాణ బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని, ఈ విషయాన్ని పార్లమెంటులో గట్టి వాదనగా తీసుకెళ్లాలని ఆయన కాంగ్రెస్ ఎంపీలను కోరారు. విపక్షాలన్నింటినీ ఈ ఉద్యమంలో కలుపుకొని, మరింత ప్రాబల్యం ఇవ్వడానికి ఇప్పటికే కార్యాచరణ రూపొందించామన్నారు.
ఇది తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశంలోనే బీసీ హక్కుల సాధనకు మార్గదర్శకంగా నిలవనుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.