తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బ్యూటీ…

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పడుకోన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ (LLL) స్థాపకురాలిగా, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తిస్తూ, భారత ప్రభుత్వం ఆమెను దేశ తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా నియమించింది.
ఈ నియామకాన్ని కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మానసిక ఆరోగ్యం గురించి సమాజంలో అవగాహన పెంచడం, చర్చలు జరపడంలో దీపిక నియామకం ఒక ప్రధాన ముందడుగుగా భావిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ “దీపికా పడుకోన్‌తో కలిసి పని చేయడం ద్వారా మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుంది. ఈ అంశాన్ని పబ్లిక్ హెల్త్‌లో భాగంగా ముందుకు తీసుకెళ్తాం” అన్నారు.
దీపికా పడుకోన్ మాట్లాడుతూ, మెంటల్ హెల్త్ అంబాసిడర్ పాత్ర తనకొక గర్వకారణం అని, ప్రధానమంత్రి నాయకత్వంలో ఈ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించారు.

