- తిరుమలలో చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత
- రేపు ఉదయం 3 గంటల తర్వాత భక్తులకు దర్శనం
తిరుమల, ఆంధ్రప్రభ : చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి(Tirumala Sri Venkateswara Swamy) ఆలయ ద్వారాలను సాంప్రదాయ బద్ధంగా మూసివేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. రాత్రి 9.50 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు మీడియాతో మాట్లాడుతూ, చంద్రగ్రహణం(Lunar Eclipse) కారణంగా ఆలయ ద్వారాలు సంప్రదాయబద్ధంగా మూసివేసి సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా శుద్ధి తదితర కార్యక్రమాలు పూర్తి చేసి ఉదయం 3 గంటలకు మళ్లీ శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లో(Q Complex Compartment) వేచి ఉన్న భక్తులందరికీ నిర్దేశిత సమయానికి అనుగుణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాట్లు కల్పించడం జరిగింది అని తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదం కాంప్లెక్స్, వకుళమాత(Vakulamata), పీఏసీ–2, వైకుంఠం వంటశాలలు మూసి వేసినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాద విభాగం భక్తుల కొరకు 50 వేల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసిందన్నారు. అన్నప్రసాద వితరణ సోమవారం ఉదయం 8 గంటల నుండి పునఃప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ అర్చకులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్నప్రసాదం డిప్యూటీ ఈఓ రాజేంద్ర, వీజీఓ సురేంద్ర, ఇతరులు పాల్గొన్నారు.