- దక్షిణాసియాలో కలకలం…
- రగులుతున్న ఆగ్రహ జ్వాలలు
శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్…. ఇవన్నీ భారతదేశానికి సరిహద్దుగా ఉన్న కీలకమైన పొరుగు దేశాలు. ఇవి కేవలం భౌగోళిక పొరుగు దేశాలే కాదు… మనకు చరిత్ర, సంస్కృతి, వాణిజ్య బంధాలతో ముడిపడి ఉన్న ప్రాంతాలు.
అయితే, ఇటీవలి కాలంలో ఈ దేశాలు ఒక్కొక్కటిగా తీవ్రమైన సంక్షోభాల్లో రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాల్లో చిక్కుకుంటున్నాయి. ప్రజలు తమ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తున్నారు. అవినీతి, నిరుద్యోగం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలను చేపడుతున్నారు.
ఈ పరిణామాలు ఆయా దేశాల అంతర్గత సమస్యలే అయినప్పటికీ, వాటి ఎఫెక్ట్ మాత్రం మొత్తం సౌత్ ఏషియాపై పడుతోంది. సౌత్ ఏషియాలో అశాంతి పెరుగుతున్న నేపథ్యంలో… మన దేశంలో శాంతి, భద్రత, అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
శ్రీలంక
2022లో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అధిక ప్రభుత్వ అప్పులు, తప్పుడు ఆర్థిక విధానాలు, అలాగే అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లు అన్నీ కలిసి ఆ దేశాన్ని పతనం అంచుకు తీసుకెళ్లాయి. దీనితో ఫుడ్, ఫ్యూయల్, ఇతర నిత్యావసర వస్తువుల కొరత తీవ్రమైంది.
ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయడంతో పెద్ద ఉద్యమంగా మారింది. దానితో ఆ దేశ అధ్యక్షుడు రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామం అక్కడి పాలనలో ఉన్న లోపాలను, లీడర్‌షిప్ ఫెయిల్యూర్స్‌ను చాలా స్పష్టంగా చూపించింది.
పాకిస్తాన్
పాకిస్తాన్‌లో చాలా సంవత్సరాలుగా రాజకీయ అస్థిరత ఒక సమస్యగా ఉంది. తరచుగా ప్రభుత్వాలు మారడం, మిలిటరీ జోక్యం చేసుకోవడం, బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత, దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. పొలిటికల్ పార్టీల మధ్య గొడవలు, చట్టవ్యవస్థపై ఉన్న అనిశ్చితి పాకిస్తాన్‌లో ఉన్న ఈ అస్థిరతను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.
మయన్మార్
2021లో సైనిక తిరుగుబాటు ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుండి దేశం అంతర్యుద్ధంలో చిక్కుకుంది. మయన్మార్‌లో చాలా కాలంగా ఉన్న మిలటరీ రూల్ వల్ల హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు, సామూహిక అరెస్టులు, అలాగే మిలటరీ రూల్‌కి వ్యతిరేకంగా పెరుగుతున్న తిరుగుబాటుతో ఆ దేశంలో సంక్షోభం మరింత పెరిగింది.
బంగ్లాదేశ్ & నేపాల్
2024లో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం తొలుత ఉద్యోగాల్లో కోటా సమస్యపై ప్రారంభమైనా, త్వరలోనే అవినీతి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఉద్యమంగా మారింది. ఈ పోరాటం చివరికి దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ప్రధానమంత్రి రాజీనామా చేయించడంలో కీలక పాత్ర పోషించింది.
ఇక ఇప్పుడు నేపాల్‌లో 2025లో ప్రారంభమైన “జనరేషన్-Z” ఉద్యమం సోషల్ మీడియా నిషేధంపై మొదలై, అవినీతి, నిరుద్యోగం, అవకాశాల కొరతపై యువత అసహనానికి మార్గం చూపింది. ఈ ఉద్యమాలు యువత తమ భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దుకోవాలనే సంకల్పాన్ని ప్రతిబింబించాయి.
భారత్ పై ప్రభావం
ఈ సంక్షోభాలకు భారతదేశం ప్రత్యక్ష కారణం కాకపోయినా, అవి పరోక్ష ప్రభావాలను చూపుతాయని చెబుతున్నారు. బోర్డర్ టెన్షన్స్, శరణార్థుల సమస్యలు, ట్రేడ్ రిలేషన్స్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ఇండియా తన పొరుగు దేశాల సంక్షోభాలను నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
అంతేకాకుండా, ఈ పరిణామాలు భారతదేశానికి ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం లేదా అవినీతి సమస్యలు మరింత విస్తృతంగా మారితే, ఇక్కడ కూడా ఇలాంటి ప్రజా ఉద్యమాలు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా దేశంలో యువత ఎక్కువగా ఉన్నందున, అవకాశాలు తగ్గితే వాళ్ల ఆగ్రహం త్వరగా పెద్ద ఉద్యమాలుగా మారే ప్రమాదం ఉంది.

