Dandepally | ఒకే శాఖ ఒకే వేతనాన్ని తక్షనమే అమలు చేయాలి

Dandepally | ఒకే శాఖ ఒకే వేతనాన్ని తక్షనమే అమలు చేయాలి

  • గ్రాంట్ ఇన్ ఎయిడ్, రెగ్యులరైజేషన్, పెన్షన్, ఆరోగ్య భద్రతపై..
  • తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ డిమాండ్

Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ ఒకే శాఖ ఒకే వేతనం విధానాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను స్పష్టం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పూర్తి స్థాయిలో అమలు చేస్తూ, జీవో నెం.577 ప్రకారం అర్హత కలిగిన 5625 మంది అర్చక ఉద్యోగులకు తక్షణమే ఈ ప్రయోజనం వర్తింపజేయాలని కోరారు.

ప్రస్తుతం కేవలం 2622 మందికే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందుతుండగా, సాంకేతిక కారణాలు చూపుతూ మిగిలిన 3000 మందికి పైగా సిబ్బందిని విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. అలాగే దేవాలయాల్లో రెండేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, తాత్కాలిక, దినసరి వేతన ఉద్యోగులను మానవీయ దృక్పథంతో రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది అర్చకులు నెలకు రూ.5000 కూడా పొందలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవాదాయ శాఖలో అధికారులు ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు, పెన్షన్లు పొందుతుండగా, అదే శాఖలో ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే అర్చకులకు ఈ సౌకర్యం లేకపోవడం వివక్షకు నిదర్శనమని అన్నారు. చట్టంలో అవసరమైన సవరణలు చేసి, అర్చక ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. దైవసేవలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన అర్చకులకు పెన్షన్ సౌకర్యం, విధుల్లో ప్రమాదవశాత్తు మరణించిన లేదా అనారోగ్యానికి గురైన సిబ్బంది కుటుంబాలకు బీమా పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

అలాగే అర్చక ఉద్యోగులు, వారి కుటుంబాలకు నగదు రహిత వైద్యం కోసం హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్, సరెండర్ లీవ్స్ మంజూరు చేయాలని, కారుణ్య నియామకంగా వచ్చిన ఉద్యోగులకు కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖలో ఔట్ సోర్సింగ్, సూపరిన్యూమరరీ వ్యవస్థలను రద్దు చేయాలని తీర్మానించారు. ఈ సమావేశం హెచ్చరిక కాదని, వేలాది అర్చక కుటుంబాల ఆకలి కేకల ప్రతిధ్వని మాత్రమేనని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మెన్ గంగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్ డి.వి.ఆర్ శర్మ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సముద్రాల రమణరావు, ముఖ్య అర్చకులు జి. రఘుస్వామి, దేవస్థాన సూపరింటెండెంట్ బి. శ్రీనివాస్తో పాటు పలు జిల్లాల అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply