బెంగళూరు : సెంట్రల్ బెంగళూరులోని విల్సన్ గార్డెన్, చిన్నయనపాల్య ప్రాంతంలో జరిగిన సిలిండర్ పేలుడు… తీవ్ర విషాదానికి కారణమైంది. ఈ ఘటనలో 10 ఏళ్ల ముబారక్ అనే బాలుడు మృతి చెందగా, 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
పేలుడు ధాటికి పక్కన ఉన్న 8 నుంచి 10 ఇళ్లు పూర్తిగా కూలిపోగా, చుట్టుపక్కల ఉన్న పలు భవనాల గోడలు, పైకప్పులు దెబ్బతిన్నాయి. సమీప ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి. వెంటనే అగ్నిమాపక దళానికి కాల్ వెళ్లగా, రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. NDRF, పోలీసులు, అత్యవసర సేవా బృందాలు శిథిలాల తొలగింపు ఆపరేషన్ ప్రారంభించాయి.
అగ్నిమాపక శాఖ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. “ప్రాథమిక పరిశీలనలో సిలిండర్ పేలుడు జరిగినట్టు తేలింది. అయితే ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది” అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సీఎం సంతాపం.. ఆర్థిక సాయం ప్రకటింపు
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన బాలుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
జాగ్రత్తలు అవసరం..
ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలుళ్లు తరచుగా జరుగుతున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, లీకేజీలను నిర్లక్ష్యం చేయడం, పాత పైపులు వాడటం, గడువు ముగిసిన సిలిండర్లు వినియోగించడం ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిపుణులు సిలిండర్‌ను సురక్షితంగా వినియోగించాలంటూ ప్రజలకు అవగాహన పెంచుతున్నారు.
ఈ ప్రమాదంతో విల్సన్ గార్డెన్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.