Cyclone | ఎపిపై విఫా తుపాన్ ప‌డ‌గ … రెండు రోజుల పాటు విస్తారంగా వాన‌లు

ఉప్పాడ స‌ముద్రంలో ఎగిసిప‌డుతున్న అల‌లు
కోత‌కు గురైన రోడ్లు .. మునిగిన మాయ‌ప‌ట్నం
ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల‌లో వాన‌లు
అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు

విశాఖ .. మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చైనా- హాంకాంగ్‌ లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్..బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని పేర్కొంది. తుఫాన్ కారణంగా రాబోయే రెండు రోజుల పాటు ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

తుపాన్ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వెంబడి గంటకు 60 కి.మీ గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కాకినాడ తీరంలో ఎగిసిప‌డుతున్న అల‌లు

విఫా తుపాన్ ప్ర‌భావంతో ఉప్పాడ తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం ఉప్పొంగడంతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామం జలమయంగా మారింది. సముద్రపు నీరు గ్రామంలోకి చొచ్చుకు రావడంతో 20 ఇళ్లు కూలిపోయాయని గ్రామస్తులు తెలిపారు. సముద్రపు నీరు దాదాపు 70 ఇళ్లలోకి చేరిందని, బయట అడుగుపెట్టే వీలులేకుండా పోయిందని వాపోయారు. తీర ప్రాంతంలో రక్షణ గోడలు, జియో ట్యూబ్ ధ్వంసం కావడం వల్లే గ్రామంలోకి సముద్రపు నీరు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. మాయపట్నం గ్రామానికి చేరుకున్న అధికారులు సముద్రపు నీటిని వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో వానలు..
ఏపీలో ఎన్టీఆర్ జిల్లా రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మైలవరంలో వాగులూ, వంకలూ ప్రవాహిస్తున్నాయి. మైలవరంలోని సూరిబాబు పేట, బాలయోగి నగర్ ప్రాంతాలకు వెళ్ళే రహదారులు కొండవాగు ఉదృతి పెరగడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రథాన రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. ఇక గత 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply