పెట్టుబడి పేరతో సైబర్ వల..

- రూ.59 లక్షలు స్వాహా..
హైదరాబాద్ (ఆంధ్రప్రభ): ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులను ఆకర్షించేలా మోసగాళ్లు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ప్రజల అత్యాశను, సులభంగా డబ్బు సంపాదించాలనే కోరికను ఆసరాగా తీసుకుని… వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు, నకిలీ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా అధిక లాభాల వాగ్దానాలతో వల వేస్తున్నారు. అమాయకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిత ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మడతల రమేశ్‌రెడ్డి, గండి శ్రీను, గుర్రపుకొండ శ్రీధర్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ముగ్గురు నిందితులు తమ పేర్లతో పలు బ్యాంకు ఖాతాలను తెరిచి, వాటి యాక్సెస్‌ను ప్రధాన సైబర్ నేరగాళ్లకు అందజేశారు. వీరు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు, నకిలీ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించి, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు.
ఈ మోసాల ఫలితంగా ఇప్పటివరకు మొత్తం రూ.59.04 లక్షలు స్కామ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజలకు సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరికలు
సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ పెట్టుబడి మోసాల నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. ఆర్థిక మోసాలకు గురికాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌లను నమ్మరాదని హెచ్చరించారు. తెలియని వ్యక్తుల సూచనల మేరకు ఎప్పుడూ పెట్టుబడులు పెట్టకూడదని సూచించారు. అలాగే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు, ఆ ప్లాట్‌ఫారమ్ SEBI అనుమతి పొందిందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలి. వ్యక్తిగత లేదా బ్యాంక్ వివరాలను ఎవరికీ పంచుకోవద్దని, అధిక లాభాల వాగ్దానాలు ఇచ్చే స్కీమ్‌లు మోసపూరితమై ఉండే అవకాశం ఎక్కువని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద లావాదేవీలను గమనించిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించి, మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.


