Cyber crimes | ‘సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్ పెడదాం’

Cyber crimes | ‘సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్ పెడదాం’
Cyber crimes | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన డిజిటల్ అలవాట్లను అలవర్చుకోవాలని కమ్మర్ పల్లి ఏఎస్ఐ జి. నరేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ( టిజి సిఎస్ బి ) ఆదేశాల మేరకు బుధవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో గ్రామస్తులతో కలిసి సైబర్ భద్రతా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ నరేందర్ మాట్లాడుతూ… ప్రస్తుత రోజుల్లో సైబర్ మోసాలు ఎక్కువగా తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, నకిలీ లింకుల ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. అనుమానాస్పద లింకులు, కాల్స్, సందేశాలకు దూరంగా ఉంటామని, ఆన్‌లైన్ చెల్లింపులు చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటామన్నారు.
సైబర్ మోసాల పట్ల కుటుంబ సభ్యులను, తోటి పౌరులను చైతన్యపరుస్తామని, ఏదైనా అనుమానాస్పద వ్యవహారం జరిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కలిసి పనిచేద్దాం — సైబర్ మోసాలను అరికడదాం అనే నినాదంతో గ్రామస్తులందరితో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా (www.cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
