- స్లో పిచ్ పై ఉత్కంఠ పోరు…
చెన్నై సొంత మైదానం చిదంబరం స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించింది. స్లో పిచ్ కారణంగా మ్యాచ్ అంతా బౌలర్లే ఆధిపత్యం చలాయించారు. అయితే, ముంబై బౌలింగ్ దాడిని ధీటుగా ఎదుర్కొన్న చెన్నై 4 వికెట్ల తేడాతో గెలిచి, సీజన్లో తమ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది.
కాగా, చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో రచిన్ రవీంద్ర ( 45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 65* నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. ముంబై నిర్దేశించిన 156 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ గా బరిలోకి దిగిన రచిన్… ఆఖరి వరకు క్రీజులో ఉండి విన్నింగ్ సిక్స్ బాది ఆహా అనిపించాడు. ఇక కెప్టెన్ రుతురాజ్ (53) ఆకట్టుకున్నాడు. మిగిలినవారంతా విఫలమవ్వగా.. చివర్లో రవీంద్ర జడేజా (17) పరుగులతో రాణించాడు.
ముంబై బౌలర్లలో యువ స్పిన్నర్ విఘ్నేఫ్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఇక విల్ జాక్స్, దీపర్ చాహర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
అంతకముందు ముంబై బ్యాటింగ్ లో తిలక్ వర్మ (31), కెప్టెన్ సూర్య కుమార్ (29), దీపక్ చాహర్ (28), నమన్ ధీన్ (17) పరుగులు సాధించారు. మిగిలినవారు అంతగా రాణించలేకపోయారు. దీంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులకే పరిమితమైంది.
చెన్నై బౌలర్లు నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక నాథన్ ఎల్లిస్, అశ్విన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.