CSK vs KKR | చెపాక్ లో చెన్నైతో కోల్‌కతా ఢీ.. టాస్ గెలిచిన కేకేఆర్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. కాగా, నేడు (శుక్రవారం) మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేటి మ్యాచ్ లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

ఇక‌పోతే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గ‌ని కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హోం గ్రౌండ్ లో చెన్నై జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది.

తుది జ‌ట్లు :

కోల్‌కతా నైట్ రైడర్స్ : క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.

చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎం.ఎస్ ధోని (కెప్టెన్ & వికెట్ కీప‌ర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్.

జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే క‌ష్టాలు త‌ప్ప‌వు..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజ‌న్లో పేలవమైన ఫామ్ తో స‌త‌మ‌త‌మౌతుంది. ముంబై ఇండియన్స్‌పై విజయంతో సీజన్‌ను ప్రారంభించిన సీఎస్కే.. అదే జోరును కొనసాగించలేకపోయింది. దీంతో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. తన మొదటి మ్యాచ్‌లో గెలిచి, ఆపై వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఈ సీజ‌న్‌లో చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. పాయింట్ల టేబుల్‌లో మెరుగైన స్థానం కోసం జట్టు స్థిరమైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలగాడు, దీంతో ధోనీ మరోసారి ఎల్లో ఆర్మీని ముందు ఉండి నడిపించనున్నాడు.

కేకేఆర్ ది అదే పరిస్థితి !

మ‌రోవైపు డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప‌రిస్థితి పెద్ద గొప్ప‌గా ఏమీ లేదు. ఈ మెగా టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్… రెండు మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

హెడ్ టు హెడ్‌..

ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ – కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు 30 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో చెన్నై 19 మ్యాచ్‌ల్లో గెలిచింది. కోల్‌క‌తా 10 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు. దీంతో ఈ మ్యాచ్ లో చెన్నై జ‌ట్టు ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *