Crossed 300 mark | చిక్కని చికెన్.. దొరకని గుడ్డు..
- జిల్లాలో భారీగా పెరిగిన కోడిగుడ్డు, చికెన్ ధరలు..
- ఆదివారం వస్తుందంటే.. సామాన్యునికి గుండె దడ..
- వారానికి ఒకసారి చికెన్ కు స్వస్తి పలుకుతున్న నిరుపేదలు..
- కోడి గుడ్డు ధర పెరగడంతో పిల్లలకు పోషకాహార లోపం..
Crossed 300 mark | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో కోడిగుడ్డు, చికెన్ ధరలు (Chicken Rates) విపరీతంగా పెరగడంతో ఆదివారం వస్తుందంటే చాలు.. సామాన్యుడి గుండెలో దడ మొదలవుతోంది. ఒక్కో గుడ్డు ధర రూ.7.50 నుంచి రూ.8 వరకు పలుకుతుండగా, కిలో చికెన్ ధర రూ.300 మార్కును దాటింది. గతంలో కుటుంబానికి సరిపడా చికెన్ తెచ్చి హాయిగా వండుకునే వారు. ఇప్పుడు అరకిలో తీసుకోవాలా వద్దా అని ఆలోచించాల్సిన పరిస్థితి. చికెన్ షాపు ముందు నిలబడి ధర అడిగి, జేబులో డబ్బులు చూసుకుని వెనుదిరిగే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Crossed 300 mark | కోడిగుడ్డు, కోడి మాంసం ధరల పెరుగుదల..
ఆదివారం అంటే తెలుగు కుటుంబాల్లో ఓ చిన్న పండుగ. వారంతా పనుల ఒత్తిడిలో గడిపిన తర్వాత, ఆ ఒక్కరోజు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని నెమ్మదిగా భోజనం చేయడం, బంధుమిత్రులను ఆహ్వానించి విందు వంటకాలు చేసుకోవడం.. అనాదిగా వస్తున్న సంప్రదాయం. ముఖ్యంగా కోడిగుడ్డు, చికెన్ వంటకాలు ఆదివారం ప్రత్యేకతగా మారాయి. పిల్లలకు ఇష్టమైన చికెన్ కూర, పెద్దలకు ఇష్టమైన మసాలా వంటలు, ఇంటి మొత్తం పరిమళంతో నిండిపోయే వంటగది. ఇవన్నీ ఆదివారం అనుభూతిలో భాగం కానీ.. ఇప్పుడు అదే ఆదివారం సామాన్య కుటుంబాలకు ఆనందం కాదు, భయాన్ని కలిగించే రోజుగా మారుతోంది. కోడిగుడ్డు, కోడి మాంసం ధరల పెరుగుదల సామాన్యుడి జీవనశైలినే మార్చేస్తోంది. వారానికి ఒకసారి అయినా.. నాన్‌వెజ్ (Nonveg) వండుకునే కుటుంబాలు ఇప్పుడు నెలకు రెండు మూడు సార్లకే పరిమితం అవుతున్నాయి. పిల్లలకు పోషకాహారం కోసం రోజూ గుడ్డు పెట్టే కుటుంబాలు కూడా ఇప్పుడు తగ్గించుకోవాల్సి వస్తోంది. గుడ్డు లాంటి చౌక ప్రోటీన్ కూడా అందుబాటులో లేకపోవడం ఆరోగ్యం పై ప్రభావం చూపే పరిస్థితి. హోటళ్లలో గుడ్డు, చికెన్ వంటకాల ధరలు కూడా పెరగడంతో బయట తినాలన్నా.. ఆలోచనను చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు.

Crossed 300 mark | సామాన్యుడి మౌన వేదన..
ఆదివారం విందు అనేది కేవలం భోజనం మాత్రమే కాదు.. కుటుంబ బంధాలను బలపరిచే ఒక సంప్రదాయం. పిల్లలు తల్లిదండ్రులతో కలిసి వంట చేయడం, బంధుమిత్రులతో సరదా మాటలు, ఒకే ప్లేటులోంచి పంచుకుని తినడం.. ఇవన్నీ కుటుంబ జీవనానికి ప్రాణం పోసేవి. కానీ.. ధరల పెరుగుదల ఈ ఆనందాలకు అడ్డుకట్ట వేసింది. చాలా కుటుంబాలు ఆదివారం నాన్‌వెజ్ మానేసి, కూరగాయలతో సరిపెట్టుకుంటున్నాయి. కొందరు పిల్లలకు నచ్చజెప్పడం కూడా కష్టంగా మారుతోంది. ఈసారి చికెన్ లేదు అన్న మాట పిల్లల ముఖాల్లో నిరాశను తెస్తోంది. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోంది. రోజువారీ కూలీలుగా పని చేసేవారు, చిన్న ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలకు (Familys) ఆదివారం నాన్‌వెజ్ ఒక పెద్ద ఆనందం. వారంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆ ఒక్కరోజు పిల్లలకు ఇష్టమైన వంటలు చేయించడం వారికి ఒక తృప్తి. అలాంటి ఆనందాన్ని కూడా ధరల పెరుగుదల దూరం చేస్తోంది. చికెన్ కొనాలంటే.. భయపడే పరిస్థితి. గుడ్లు తగ్గించి వండుకోవాల్సిన పరిస్థితి సామాన్యుడి మౌన వేదనకు అద్దం పడుతోంది.

Crossed 300 mark | వినియోగదారుడికి మాత్రం ఫలితం ఒక్కటే..
ధరలు ఎందుకు ఇలా పెరిగాయన్న విషయం పై సామాన్యుడికి పెద్దగా అవగాహన లేకపోయినా, ప్రభావం మాత్రం నేరుగా జేబు పై పడుతోంది. చలికాలం, ఉత్పత్తి లోటు, దాణా ఖర్చులు, ఎగుమతులు వంటి కారణాలు వ్యాపార వర్గాలు చెబుతున్నా, వినియోగదారుడికి మాత్రం ఫలితం ఒక్కటే ఖర్చులు పెరగడం. ఆదివారం వస్తుందంటే సరదా కాదు.. ఈసారి ఏమి వండాలి, ఎంత ఖర్చు అవుతుంది అనే ఆందోళన మొదలవుతోంది. వ్యాపార వర్గాల అంచనాల ప్రకారం.. కొత్త ఉత్పత్తి మార్కెట్‌లోకి (Market) వచ్చే వరకు ఇంకా కొన్ని వారాలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని చెబుతున్నారు. అప్పటి వరకు చికెన్, గుడ్డు ధరల భారం సామాన్య కుటుంబాలను వెంటాడుతూనే ఉంటుంది. ఆదివారం విందు మళ్లీ ఆనందంగా మారాలంటే.. ధరలు తగ్గాల్సిందేనన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు వంటగదిలో మంటకన్నా ధరల మంట ఎక్కువగా మండుతూనే ఉంటుందన్నది ప్రస్తుత వాస్తవం.


