నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు…..

నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు…..
రోడ్డెక్కిన అన్నదాతలు.
రాయపోల్, ఆంధ్రప్రభ : సాగునీరు లేక యాసంగి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రాయపోల్ మండలంలో రైతులు రోడ్డెక్కారు. బుధవారం మండలంలోని వీరనగర్ వద్ద లింగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కాల్వ ద్వారా తమ చెరువులకు వెంటనే నీటిని వదలాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో దాదాపు రెండు గంటల పాటు రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… రామాయంపేట కాల్వ తమ గ్రామాల పక్కనే ఉన్నా చెరువులకు నీళ్లు వదలకపోవడం వల్ల చెరువుల కింద సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి వరి నాట్లు వేసినా నీరు లేక పంటలు పాడవుతున్నాయని అన్నారు. కాల్వ ఉండి కూడా నీళ్లు రాకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.వెంటనే మూడు గ్రామాల చెరువులకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
విషయం తెలుసుకున్న రాయపోల్ ఎస్‌ఐ మానస సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు.
ఈ ఆందోళనలో లింగారెడ్డిపల్లి సర్పంచ్ స్వామి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ స్వామి తదితరులు, రైతులు పాల్గొన్నారు.
