Crime News | ప్రతీకార ఉన్మాదం! ఏపీలో ఒకే రోజు మూడు దారుణ హత్యలు

ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఒకే రోజు కర్నూలు.. చిత్తూరు.. ఎన్టీఆర్ జిల్లాల్లో వేర్వేరు హత్యలు సంచలనం రేపాయి. ఈ మూడు దారుణ హత్యల్లో పగ, ప్రతీకారమే కనిపిస్తోంది. ముగ్గురు హతులూ వేర్వేరు రాజకీయ పార్టీల నాయకులు, సానుభూతి పరులు కావటం విశేషం. ఈ హ‌త్యా ఉదంతాల‌తో ఏపీలో కలకలం రేగింది. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ నేతలపై ప్రత్యర్థులు కక్ష తీర్చుకుంటే.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కంచికచర్లకు చెందిన రౌడీషీటర్ ను చంపేశాడు. ఏపీలో ప్రోమోన్మాద పైశాచిక‌త్వం.. వేర్వేరు ఘటనల వివరాలిలా ఉన్నాయి.

కర్నూలులో పగోన్మాదం

కర్నూలు నగరంలోని శరీన్ నగర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ కోశపోగు సంజన్నను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. అదే కాలనీలో సంజన్న శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ భజన కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేశారు.సంజన్న ప్రత్యుర్థులు అంజి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. తీవ్రంగా గాయపడిన సంజన్నను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెంచారు. ఈ హత్య తర్వాత శరీన్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అత్యంత కిరాతకంగా…

దుండగుల దాడికి సంజన్నను అతి కిరాతకంగా చంపేశారు. కత్తుల దాడిలో ఆయన తల ఛిద్రమైంది. అక్కడే కుప్పకూలి పడిపోయారు. గమనించిన స్థానికులు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజన్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ హత్య గురించి తెలిసి తెలుగుదేశం పార్టీ వర్గీయులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ హత్యకు కారణం వడ్డె అంజీ అని భావించిన సంజన్న వర్గీయులు కోపోద్రేకంతో.. అంజీ వాహనంపైన రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో కాలనీలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వడ్డె అంజి, అతని కుమారులు మరికొందరు ఘటనలో పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణతో తెలిసింది. దీనిపై కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మళ్లీ ఎలాంటి గొడక్షలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఆదిపత్య పోరు

శరీన్ నగర్ కు చెందిన సంజన్న సీపీఎం వామపక్ష భావాలతో రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్ గా పని చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గీయుడు కావటంతో.. వైసీపీలో ప్రాధాన్యం పెరిగింది. ఆయన భార్యను కార్పొరేటర్ గా గెలించారు. ఆ తరువాత తన కుమారుడు జయరాంను కార్పొరేటర్ గా గెలిపించుకున్నారు. కాటసానితో పొసగడం లేదని ఎన్నికల సమయంలో బైరెడ్డి శిరీష వర్గంలో చేరారు. టీడీపీలో చేరారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గీయుడు రౌడీషీటర్ వడ్డె రామాంజనేయులు అలియాస్ వడ్డె అంజితో సంజన్నకు ఆధిపత్యపోరు ఎక్కువైంది. మూడు నెలల కిందట అంజి, సంజన్న వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవ కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అంజిపై హత్య కేసులు ఉన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు శరీన్ నగర్ లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ జిల్లాలో మిస్టరీ హత్య

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధి ఫెర్రీలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు.. కంచికచర్ల రౌడీషీటర్ జారభావ వెంకటేష్ ను ఐదుగురు యువకులు హతమార్చారు. శుక్రవారం రాత్రి ఫెర్రీలో జరిగిన గొడవలో ఆ యువకులు బండరాయితో దాడి చేసి చంపేశారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన హతుడు మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య ఘటనపై ప్రాథమిక సమాచారం ఇవ్వటానికి పోలీసులు సుతారాము అనుమతించలేదు. సాదాసీదాగా యువకుల మధ్య జరిగిన గొడవలో రౌడీషీటర్ హత్య జరిగిందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే సమాచారం లేదు. ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీకి అనుచరుడు కావటంతో ఈ హత్యకు ప్రాధాన్యత పెరిగింది. విజయవాడ పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలికి చేరుకోవటంతో.. పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పుంగనూరులో..మితిమీరిన కక్షతో

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని కిష్టాపురంలో మాజీ వలంటీర్ భర్త రెచ్చిపోయాడు. స్థానిక తెలుగుదేశం నాయకుడిపై కొడవలితో దాడి చేసి చంపేశాడు. వివరాలు ఉన్నాయి. కృష్ణాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామకృష్ణతో ఓ మహిళ వలంటీర్ భర్త వెంకటరమణకు పాతకక్షలు ఉన్నాయి. శనివారం ఉదయం శనివారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. మాటా మాటా పెరగడంతో వెంకటరమణ కొడవలితో రామకృష్ణ(55) అతని కుమారుడు సురేష్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తనకు ప్రాణహాని ఉందని మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని రామకృష్ణ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *