Crime | గొడవ ఆపే ప్రయత్నంలో…

జన్నారం, (ఆంధ్రప్రభ): ఇంటి పక్క ప్రహరీ గోడ వ్యవహారంలో ఇరు వర్గాలు గొడవపడి, గొడవ ఆపడానికి మధ్యలో వచ్చిన వేరొకరిపై వారి ప్రతాపం చూపారు… ఫలితంగా, ఒక నిస్సహాయురాలైన 61 ఏండ్ల వృద్ధురాలు ప్రాణం పోగొట్టుకున్న ఉదంతమిది.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని లింగయ్యపల్లి వాసి గొట్ల బుచ్చమ్మ(61) అదే గ్రామానికి చెందిన అయ్యోరు తిరుపతి, చంద్రమౌళిలు మంగళవారం రాత్రి ప్రహరీ గోడ వ్యవహారంలో గొడవ పడి నెట్టి వేయగా డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష బుధవారం తెలిపారు.

ఈ నెల 22 న రాత్రి గొట్ల గంగయ్య చిన్న కొడుకు తిరుపతి, అదే గ్రామానికి చెందిన అయ్యోరు సత్తయ్య, చంద్రమౌళిలు కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారని, ఆ గొడవ ఆపడానికి వారిద్దరి మధ్యలోకి వెళ్లిన బుచ్చమ్మను సత్తయ్య, చంద్రమౌళిలు నెట్టివేయగా, ఆమె పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందిందన్నారు.

భార్య ఇంట్లో కనిపించక పోవడంతో వృద్ధురాలి భర్త, చుట్టు పక్కల బుధవారం ఉదయం వెతకగా, ఇంటి ముందున్న డ్రైనేజీలో పడి కనిపించిందని, తన భార్య మృతికి సత్తయ్య, చంద్రమౌళిలు కారణమని మృతురాలు భర్త గంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు.

లింగయ్యపల్లి సంఘటన స్థలాన్ని లక్షేట్టి పేట సీఐ రమణమూర్తి, స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష సందర్శించి, విచారణ జరిపారు. ప్రహరీ గోడ వ్యవహారంలో లింగయ్యపల్లికి చెందిన అయ్యోరు సత్తన్న, చంద్రమౌళిలను అదే గ్రామానికి చెందిన గొట్ల తిరుపతి, రాజన్నలు మంగళవారం రాత్రి నానా బూతులు తిడుతూ, కర్రలతో దాడి చేసి కొట్టగా సత్తన్న, చంద్రమౌళిలకు తీవ్ర గాయాలై, మంచిర్యాలలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కొట్లాటలో సత్తన్న తల పగిలి, చేయి ఎముక విరిగిందని, చంద్రమౌళి తల పగిలి, నడుముకు, భుజానికి బలమైన గాయాలైనట్లు సత్తన్న భార్య లావణ్య ఫిర్యాదు మేరకు గొట్ల తిరుపతి, రాజన్నలపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తీవ్ర గాయాల గురైన ఆ బాధితులు ఇద్దరు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతున్నారు.

Leave a Reply