విజయవాడ, (ఆంధ్రప్రభ): మాజీ ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యాచేంద్ర (93) మృతి పై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపి సానా సతీష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంగంలో తీరని లోటని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాచేంద్ర వయోభారం కారణంగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గురువారం మృతి చెందారు.
రాజగోపాల్ యాచేంద్ర పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుకుంటూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఏసీఏ తరఫున ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్, రాజ్యసభ ఎంపి సానా సతీష్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేయటంతో పాటు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన యాచేంద్ర ఆంధ్ర రంజీ క్రికెట్ టీమ్ లో 1956 నుంచి 1965 మధ్య 15 రంజీ ట్రోఫీ మ్యాచ్ ల్లో బ్యాటింగ్ తో పాటు లెగ్ బ్రేక్ బౌలింగ్ చేసి ప్రతిభ గల క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు 1963 నుండి 1965 వరకు ఆంధ్ర జట్టుకు నాయకత్వం వహించారన్నారు.
ఆంధ్ర రంజీ క్రికెట్ టీమ్ లో ఆడి ఎంతో మంది క్రికెట్ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. బహుముఖ క్రీడా సామర్థ్యాలతో క్రికెటర్ గానే కాకుండా టేబుల్ టెన్నిస్ లో కూడా అగ్రశ్రేణి ఆటగాడిగా మంచి గుర్తింపు పొందిన యాచేంద్ర నేటితరం క్రీడాకారులకు ఆదర్శమన్నారు.