Cricket | వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్

Cricket | వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్
- ఫామ్‌లోకి భారత ఆటగాళ్లు
- పరుగుల దాహం తీర్చుకుంటున్న కెప్టెన్ సూర్య
- రెచ్చిపోతున్న డైనమెట్ ఇషాన్
- షేక్ చేస్తున్న అభిషేక్
Cricket | వచ్చే నెల నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి మరో 12 రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ ప్రపంచ కప్‌నకు టీమిండియా (Team India) సన్నద్ధత పై చర్చ కొనసాగుతోంది. ఆటగాళ్ల ఫామ్ ఎలా ఉంది.. మెగా టోర్నీలో మన అవకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే.. టీమిండియాలో ఉన్న కొన్ని లోపాలు కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో కొన్ని సర్దుకున్నట్లు కనిపిస్తోంది.
వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ :
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. కివీస్‌తో టి20 సిరీస్‌లో మన బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. వరుసగా మూడు మ్యాచులు గెలిచి ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచులు నామమాత్రమే. ఆ రెండు మ్యాచులను కూడా వరల్డ్ కప్‌నకు ముందు ప్రాక్టీస్‌కు ఉపయోగించుకొని మెగా సమరానికి పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలని టీమిండియా భావిస్తోంది. భారత్ ఎక్కువగా అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్ మీద ఆధారపడుతోంది అనే విమర్శలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అయితే అతడు డకౌట్ అయినా రెండో టీలో భారీ స్కోరు సాధించి మన బ్యాటింగ్ బలమెంతో చూపించింది టీమ్ ఇండియా.
Cricket | ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్
పొట్టి ఫార్మట్‌లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తోంది. ఆటగాళ్లంతా బాగా ఆడుతున్నారు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం పూర్ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. సుమారు ఒకటిన్నర సంవత్సరంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే న్యూజిలాండ్ జరుగుతున్న సిరీస్‌లో సూర్య వరుసగా రెండు అర్ధ సెంచరీలు (82, 57) చేసి పరుగుల దాహం తీర్చుకున్నాడు. ఇక సంజూ శాంసన్ (Sanju Samson) నిలకడ ఉండదు. ఇదేమన్నా జట్టుకు ఇబ్బంది కలిగిస్తుందా అని అనుమానం చాలామందిలో వ్యక్తమైంది. ఈ తరుణంలో ఇషాన్ కిషన్ నేనున్నా అంటూ డైనమైట్లా దూసుకొచ్చాడు. ఇక ఫినిషర్ రోల్లో శివమ్ దూబే, రింకు సింగ్ ఉండనే ఉన్నారు. వారు కూడా కివీస్‌తో సిరీస్‌లో రాణించడంతో టీమిండియా ఇప్పుడు నిశ్చింతగా ఉంది.

Cricket | వికెట్లు తీస్తున్న బౌలర్లు
టీమిండియా బౌలర్లపై కూడా అనేక కొన్ని నెలలుగా క్లారిటీ లేదు. ఎవరు రాణిస్తారో.. ఎవరు ఫెయిల్ అవుతారో తెలియని పరిస్థితి. అయితే ఇప్పడు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రారంభ ఓవర్లలో వికెట్లు తీసి ఆ భయం పూర్తిగా పోగొట్టారు. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఈ మధ్య భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఒకవేళ కుల్దప్ ఫెయిలైతే.. నేనున్నా కదా అని రవి బిష్ణోయ్ అంటున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో అతను (2/18) ఇరగదీశాడు.

Cricket | కొన్ని విషయాల్లో ఇంకా మెరుగు పడాలి..
హర్షిత్, అర్షదీప్, కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్లు ఒక్కోసారి ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ఇది కంట్రోల్ చేయాలి. ఫీల్డింగ్ విషయంలో మూడో టీ20లో మెరుగుపడినప్పటికీ.. దీనిపై ఇంకా వర్క్ చేయాల్సిఉంది. సులభమైన క్యాచులు వదిలేస్తున్నారు. పార్ట్ టైమ్ బౌలర్లుగా (Bowlers) ఉన్న శివమ్ దూబె, అభిషేక్ శర్మ లాంటి వాళ్లు వికెట్లు తీయకపోయినా పరుగులు ఎక్కువ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ మెరుగు పరుచుకుంటే టీమిండియా వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశం మెండుగా ఉంది. టీమ్ ఇండియా చరిత్రను తిరగరాయడం ఖాయం. ఇప్పటివరకు ఏ జట్టూ వరుసగా రెండు టీ20 కప్పులు గెలవలేదు.

