Cricket | దెబ్బకు దెబ్బ కొట్టేనా?

Cricket | దెబ్బకు దెబ్బ కొట్టేనా?
- నేడే భారత్-న్యూజిలాండ్ తొలి టీ20..
- ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా రెడీ
- టీ20 వరల్డ్‌కప్ ముందు భారత్‌కు అసలైన పరీక్ష
Cricket | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఇటీవల టీమిండియా టెస్టులు, వన్డేల్లో తేలిపోతోంది. సొంత గడ్డపై కూడా విజయాలు సాధించలేక చతికల పడుతోంది. ఇటీవల సౌతాఫ్రికాతో టెస్టుల్లో వైట్‌వాష్, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ పరాజయం తర్వాత టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఈ పరిస్థితిలో నేటి నుంచి న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడపోతోంది. టీ20 వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు ఈ సిరీస్ ఎంతో ప్రతిష్టాత్మకం. నేడు (జనవరి 21) తొలి మ్యాచ్‌లో (Match) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు జట్లు టీ20 ఫార్మాట్లో తలపడుతుండటంతో బాక్సాఫీస్ ఫైట్ ఖాయమనిపిస్తోంది. చివరగా 2023, ఫిబ్రవరి 1న ఇరు జట్లు ఈ ఫార్మాట్లో పోటీపడ్డాయి.
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా మంచి విజయాలు సాధిస్తుంది. కానీ కెప్టెన్ ఫాం ఆందోళన కలిగిస్తోంది. 2024లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్య నాయకత్వంలో భారత్ 70 శాతం పైగా మ్యాచ్‌లు గెలిచింది. కానీ ఇటీవలి కాలంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వైఫల్యాలు అతనిపై ఒత్తిడి పెంచుతున్నాయి. కివీస్‌తో సిరీస్‌లో సూర్య (Surya) మళ్లీ తన సహజమైన దూకుడు బ్యాటింగ్‌ను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత భారత్ ఈ ఫార్మాట్లో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్‌ను ఓడిస్తే, ప్రపంచ కప్‌కు ముందు జట్టుకు కావాల్సిన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
Cricket | టీమిండియాకు గాయాల దెబ్బ..
గాయంతో తిలక్ వర్మ దూరం కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది. మూడేళ్లకు పైగా టీ20ల్లో ఆడని శ్రేయస్ ఈసారి ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌పై భారీ ఆశలు ఉన్నాయి. అభిషేక్ (Abhishek) విధ్వంసకర బ్యాటింగ్ జట్టుకు వేగంగా ఆరంభం ఇస్తుందని భావిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరిసిన ఇషాన్ కిషన్ మూడో స్థానంలో కీలక పాత్ర పోషించనున్నాడు. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా ప్రధాన బలంగా నిలవనున్నాడు. అతనితో పాటు శివమ్ దూబే కూడా ఆల్‌రౌండర్‌గా కీలకంగా మారనున్నాడు. నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బుమ్రా ఒక్కరే స్పెషలిస్టు పేసర్‌గా ఆడే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిపై బాధ్యతలు పడనున్నాయి.

Cricket | పిచ్ రిపోర్ట్
నాగ్‌పూర్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు (Spinner) అనుకూలిస్తుంది. మ్యాచ్ గడుస్తున్న కొద్దీ స్లో అయ్యే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ ద్వయం కివీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

Cricket | ఎక్కడ చూడొచ్చంటే..
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టీ20 సిరీస్‌ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే, మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత జట్టు ఇప్పటివరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 3 విజయాలు, 2 పరాజయాలు ఉన్నాయి. చివరిసారిగా 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం (Win) సాధించింది. భారత్–న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 25 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 14 మ్యాచ్‌లు గెలిచితే, న్యూజిలాండ్ 10 మ్యాచ్‌లలో విజయం సాధించింది. గణాంకాల ప్రకారం టీ20 ఫార్మాట్లో భారత్‌కు స్వల్ప ఆధిక్యం కనపడుతుంది.

Cricket | భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ / ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ / శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ / హర్షిత్ రాణా
CLICK HERE TO READ బ్యాడ్మింటన్ కు సైనా నెహ్వాల్ రిటైర్మెంట్
