ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ

ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ

  • 7ఆర్ కాల్వ పనులు వెంటనే ప్రారంభించాలి
  • సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కలవలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీటి కొరతతో బోరుబావులపై ఆధారపడి సాగు చేసిన వరి పంటలు ఎండిపోవడంతో రైతు నాయకుల విజ్ఞప్తి మేరకు ఆయన పంట పొలాలను సందర్శించారు.ట్యాంకర్ నీటితో పంటలను కాపాడుకునే పరిస్థితి రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కలవలపల్లి గ్రామ సాగునీటికి సంబంధించిన 7ఆర్ మైనర్ కాల్వ పనులు తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్వ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మునుగోడు ప్రాంతంలోని 17 గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని పేర్కొంటూ, బాధిత రైతులకు ఎకరాకు రూ.40 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు నుంచి కాల్వను కిష్టాపురం వరకు పొడిగించి మునుగోడు, నల్లగొండ మండలాల చెరువులను నింపాలని కోరారు. పులిపలపుల, కలవలపల్లి, కాశవారిగూడెం, బీరెల్లిగూడెం గ్రామాలకు తక్షణమే నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. 7ఆర్ కాల్వ నిర్మాణం కోసం కలవలపల్లి గ్రామం నుంచే 36 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ పనులు పూర్తికాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని, లేదంటే 17 గ్రామాల రైతులను సమీకరించి సాగునీటి కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కల్వలపల్లి మాజీ సర్పంచ్ గట్టుపల్లి నర్సిరెడ్డి,తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు,సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీనివాస్,జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి,ఉప సర్పంచ్ వీరమల్లు,సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేశం,ఏంపల సాయిలు,పంతంగి లక్ష్మయ్య,గుండెబోయిన దనమ్మ,పర్ని లచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply