దాయాదుల మధ్య ఆస్తుల కోసం, అధికారం కోసం పొరపొచ్చాలు వస్తుంటాయి. అవే చిలికి చిలికి గాలివానలా మారి రెండు వర్గాల మధ్యన తగవులుగా పరిణమిస్తాయి. దీనివల్ల సాధారణంగా ఒకరంటే ఒకరికి నచ్చకపోవడం, ఒకరి ఉన్నతిని మరొకరు తట్టుకోలేకపోవడం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి మీద కోపం ఉండడం సర్వసాధారణమే. కానీ ఆ కోపం ఎట్టిపరిస్థితుల్లోనూ జీవితాంతం కొనసాగడం మంచిది కాదు. ఒకరి పట్ల ఒకరు కక్షాకార్పణ్యాలతో మెలగడం ఏ ఒక్కరికీ మేలు చేకూర్చదు. దీనివల్ల వారు తీవ్ర ఆందోళనతో రోజంతా గడుపుతారు. ఇది వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. దాంతో ఇరువురి జీవితాలు సుఖశాంతులు లేకుండా పోతాయి. చివరికి దీని పరిణామం ఎలా ఉంటుందంటే, చావు పుటకలలో కూడా ఒకరికొకరు ఎదురుపడి పలుకరించుకునే పరిస్థితి ఉండదు. చనిపోయిన వ్యక్తిపై పీకల్లోతు కోపం ఉన్నప్పటికీ, ఆ మరణించిన వ్యక్తి పార్థివదేహం దగ్గరకు ఆ వ్యక్తి వచ్చి కనీసం సానుభూతి ప్రకటించలేకపోవడం కచ్చితంగా నేరమే ఔతుంది. ఈ భూమ్మీద ఏ జీవైనా చనిపోవడం ఖాయమే. ఈరోజు నువ్వూ, రేపు నేనూ అనే విధంగానే ఉంటుంది మరణం. అలాంటి అనివార్యమైన ప్రక్రియను ఎదుర్కొనే మానవులు, ఎందుకు తమ జీవనపర్యంతం వరకూ ఈర్ష్యాసూయాద్వేషాలతో రగిలిపోతారో? అర్థం కాదు. ఇరువర్గాల నడుమ ఇంత వ్యవహారం నడిచినప్పటికీ, మానవుడు పాటించాల్సిన ధర్మమొకటి ఉంది. అదే దాయాది ధర్మం.
మహాభారతంలో ఈ ధర్మాన్ని తెలియజేసే సంఘటన ఒకటుంది. ఆ ధర్మం మానవునికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఘోషయాత్రలో ఉన్న పాండవులను అవహేళన చేయడానికి కౌరవులు ద్వైతవనానికి వెళ్తారు. పాండవులు ఉన్న చోటుకి దగ్గరలో కౌరవులు సకల సైన్యంతో సహా తాత్కాలికంగా ఓ నివాసం ఏర్పరచుకుంటారు. కౌరవులు తమ గోసంపదను పర్యవేక్షించడానికనే నెపంతో అక్కడికి చేరుతారు. కానీ వారి అంతరార్థం వేరు. కౌరవుల వైభవానికి పాండవులు ఉడుకుపోవాలనే దురుద్దేశంతో, అక్కడ సకల రాజ కళా వైభవాలతో వివిధ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆయా కార్యక్రమాలలో సకల పరివారం ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. మద్యం మత్తులో ఓలలాడుతూ, అక్కడున్న సుందర అటవీ ఉద్యానవన ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తుంటారు. ఆ ఉద్యానవనం చిత్రసేనుడనే గంధర్వరాజుది. ఆయన కోపంతో తన అటవీ ఉద్యానవనాన్ని నాశనం చేయడాన్ని తప్పుపడతాడు. దానికి దుర్యోధనాదులు అధికార మదంతో చిత్రసేనుణ్ణి అవమానిస్తారు. దాంతో చిత్రసేనుడు కోపంతో రగిలిపోయి కౌరవసేనపై యుద్ధానికి దిగుతాడు. అంతటితో ఆగక దుర్యోధనాదుల్ని త్రాళ్ళతో కట్టిపడవేసి బందీలుగా తన లోకానికి తీసుకుపోయే ప్రయత్నంలో ఉంటాడు.
ఈ విషయం కౌరవ పరివారం ద్వారా దగ్గరలో ఉన్న ధర్మరాజుకు తెలుస్తుంది. ఎంతైనా తన పెద్ద తండ్రి కుమారులు కదా! కౌరవులు. వారి పరువు పోతే ఏమిటి? తమ పరువు పోతే ఏమిటి? ఏదైనా తమ కురువంశమే అప్రతిష్ఠపాలు ఔతుంది కదా! అని భావిస్తాడు. అంతే, తన తమ్ముళ్ళు భీమార్జునులను పిలిచి కౌరవులను రక్షించమని ఆదేశిస్తాడు. ఈ నిర్ణయాన్ని తొలుత భీమసేనుడు వ్యతిరేకిస్తాడు. అప్పుడు ధర్మమూర్తి అయిన ధర్మరాజు ఇలా అంటాడు. మనలో మనకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు గాక. మనలో మనం తగాదాలు పడినప్పుడు మనం ఐదుగురము, వాళ్లు నూరుగురుగా అనుకోవాలి. కానీ ఇలాంటి ఆపద సమయంలోనే మనం నూటఐదు మంది సోదరులమనే మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదు. ఇలాంటప్పుడే మన ఐక్యమత్యం పదిమందికీ తెలియాలి. దీన్నే దాయాది ధర్మం అంటారని ధర్మరాజు తన సోదరులకు హితబోధ చేస్తాడు. చివరికి తన అన్న పైనున్న గౌరవంతో ఇద్దరు సోదరులూ యుద్ధానికి వెళ్తారు. చిత్రసేనుణ్ణి యుద్ధంలో ఓడిస్తారు. బందీలుగా ఉన్న దుర్యోధనాదుల్ని విడిపిస్తారు. తద్వారా కురు వంశ ప్రతిష్ఠను నిలుపుతారు.
- జానకి