Counter | మా జోలికి వ‌స్తే తాట తీస్తాం – బిఆర్ఎస్ కు మంత్రి పొంగులేటి వార్నింగ్

హైద‌రాబాద్ – దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికివస్తే తాట తీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ప‌లువురు వ్యాపారులు రేవంత్ స‌ర్కార్ కూల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ కొత్త ప్ర‌భాక‌ర‌రెడ్డి చేసిన వ్యాఖ్యాల‌ను మంత్రి ఖండించారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అధికార దాహంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి అంటే కేసీఆర్‌ ఆత్మ అని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ మాటలనే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారని అన్నారు. ధరణి పోర్టల్‌తో భూములను అక్రమంగా దోచుకుని.. వారి అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. అక్రమంగా దోచుకున్న భూములను తమ ప్రభుత్వం.. వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో అక్రమ సంపాదనతో లాభపడ్డ నేతలే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనాలని వారు చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారికి సంకెళ్లు వేసి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదని చెప్పారు. ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనాలని సవాల్ విసిరారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చి ఆ కుర్చీలో కూర్చోవాలని.. తండ్రీ, కొడుకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

కుట్రకోణంగా భావిస్తున్నాం: ఆది శ్రీనివాస్‌

బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఖండించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామన్నారు. ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరతామని చెప్పారు. కుట్రకోణం ఉన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *