Counseling | నేర ప్రవృత్తిని వీడాలి..

Counseling | నేర ప్రవృత్తిని వీడాలి..
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
- రౌడీషీటర్లకు నకరికల్లు ఎస్సై సతీష్
Counseling | నకరికల్లు, ఆంధ్రప్రభ : మండల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నకరికల్లు ఎస్సై సతీష్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పాత నేరస్తులకు, రౌడీ షీటర్లకు నిర్వహించిన కౌన్సెలింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ, మండలంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూసినా, గ్రూపు రాజకీయాలతో అలజడులు సృష్టించినా సహించేది లేదని స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రతి ఒక్కరూ పోలీస్ నిబంధనలను పాటించాలని సూచించారు.
రౌడీ షీటర్లకు ఎస్సై కీలక సూచనలు చేశారు. పాత కక్షలను, నేర ప్రవృత్తిని వీడి సాధారణ పౌరులుగా జీవించాలని హితవు పలికారు. ఏదైనా అవాంఛనీయ ఘటనల్లో పాల్గొన్నట్లు తేలితే వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు తప్పనిసరిగా హాజరై తమ ప్రస్తుత వివరాలను అందజేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎవరైనా కొత్తవారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
