హిందూపురంలో కార్డెన్ సెర్చ్
- పత్రాలు లేని పలు వాహనాలు సీజ్
- శాంతిభద్రతల పరిరక్షణకే తనిఖీలు
- శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు (కార్డెన్ సెర్చ్) నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్(S Satish Kumar) తెలిపారు. ఎస్పీ, ఇరువురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 8 మంది ఎస్ఐలు మొత్తం 120 మందితో హిందూపురంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. 120 మంది సిబ్బందితో 10 పైగా బృందాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసి, 77 ద్విచక్ర వాహనాలు,7 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చిలమత్తూరు రేప్ కేసులో నేరస్తులైన ఎరికల కావడి నాగేంద్ర, సాకే ప్రవీణ్ కుమార్(Sake Praveen Kumar), శ్రీకాంత్ ఇండ్లతోపాటు మోడల్ కాలనీలో ఉంటున్ననలుగురు యువకులు దాసరి అరుణ్, ఇస్మాయిల్, వసీం ఇండ్లను కూడా తనిఖీ చేసి హెచ్చరికలు జారీ చేశారు.
వీరితోపాటు రౌడీ షీటర్ల ఇండ్లను కూడా తనిఖీ చేసి, నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారు? వీటికి గల కారణాలేమి? ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా సహకరిస్తున్నాయి? వంటివి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో“ రాత్రి సమయాల్లో తాగి గొడవలు, అల్లర్లు చేసే వారిపై కొత్త రౌడీ షీట్లు(rowdy sheets) తెరవబడతాయి,” అని హెచ్చరించారు.
నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని వాహనాలకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఉంచి పరిశీలన జరుగుతోంది. సరైన రికార్డులు చూపని వారిపై 102 సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) తనిఖీలు మరింత కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో హిందూపురం, పెనుకొండ డీఎస్పీలు మహేశ్, నర్సింగప్ప,సీఐలు రాజగోపాల్ నాయుడు అబ్దుల్ కరీం ,జనార్దన్, ఆంజనేయులు, రాజ్ కుమార్(Raj Kumar), ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

