పైప్డ్ గ్యాస్.. సురక్షితం, సౌకర్యవంతం…

పైప్డ్ గ్యాస్.. సురక్షితం, సౌకర్యవంతం…
పీఎన్‌జీ కనెక్షన్ దిశగా ప్రజలు దృష్టిసారించాలి..
ముందు జాగ్రత్తగా వినియోగానికి ముందుకు రావాలి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా ప్రజలు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వినియోగం వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. కలెక్టర్ లక్ష్మీశ.. ఆదివారం క్యాంపు కార్యాలయంలో భాగ్యనగర్ గ్యాస్, మేఘా గ్యాస్ ప్రతినిధులతో సమావేశం అనంతరం సిద్ధార్థ నగర్ ఎస్‌బీఐ కాలనీలోని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ రెగ్యులేటింగ్ స్టేషన్ ను సందర్శించారు.
కుళాయి నీటి తరహాలో పైపుల ద్వారా ఇంటింటికీ నేచురల్ గ్యాస్ సరఫరా విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 9 వేలు మాత్రమే పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నాయని.. లక్ష వరకు కనెక్షన్లు ఇవ్వగల సామర్థ్యం ఇప్పుడు ఉందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక భద్రతతో నిరంతర గ్యాస్ సరఫరాకు ఈ కనెక్షన్లు వీలుకల్పిస్తాయన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు లేదా సంక్షోభ పరిస్థితులు ఎదురైనా గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు పీఎన్‌జీ ఉత్తమ ప్రత్యామ్నాయమని తెలిపారు.

గృహాలకు నేరుగా పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందుబాటులో ఉండటం వల్ల సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. 21 మిల్లీబార్ పీడనంతో సరఫరా అనేది సురక్షితమైనదని.. అందువల్ల ఇలాంటి సురక్షితమైన వంట గ్యాస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా హోటళ్లు పీఎన్‌జీ ఉపయోగిస్తున్నాయని.. మిగిలినవి కూడా పీఎన్‌జీ దిశగా ఆలోచించాలని కోరారు. జిల్లాలో ఎవరికైనా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్ కావాలనుకుంటే కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) నంబరుకు కాల్ చేయొచ్చని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
గృహాలు, హోటళ్లు, పారిశ్రామిక యూనిట్లు తదితరాలకు సురక్షితమైన, నిరంతర గ్యాస్ సరఫరా అందించేలా పీఎన్‌జీ కనెక్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. పీఎన్‌జీ ప్రయోజనాలతో పాటు పూర్తి వివరాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న సిబ్బంది వివరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
