కొనసాగిస్తున్న ఆచార వ్యవహారాలు
ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ : క్షత్రియ రాజపుత్రులు రాజా మహారాణాప్రతాప్(Maharana Pratap) వారసులు రాజ్యాధికారులు, ప్రభువులు తలుచుకుంటే కానిది ఏమీ ఉండదు. మంది, మార్బలం, హంగూ ఆర్భాటం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వాతంత్య్రం అనంతరం రాజ్యాలు పోయి రాజరికపు పాలన అంతరించగా కాలానుగుణంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి.
సామాజిక, ఆర్థిక స్థితిగతులతో అంతరాలు ఏర్పడ్డాయి. అయినా.. క్షత్రియ రాజపుత్రులు తమ వంశపారంపర్యంగా వస్తున్నఆచారాలు, వ్యవహారాలను కొనసాగిస్తూ తమ సంప్రదాయాన్ని కాపాడుకుంటున్నారు. పెళ్లి తంతును ఇప్పటికీ విభిన్నంగా కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకూ అందిస్తున్నారు. క్షత్రియ రాజ్(Kshatriya Raj) పుత్ర వివాహ తంతు పై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ..
బుందేల్ ఖండ్ నుంచి..
క్షతీయ రాజపుత్రులు రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటీష్ పాలనలో ఉద్యోగరీత్యా రాజ పుత్ర మిలటరీ బెటాలియన్ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బుందేల్ ఖండ్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వచ్చారు. రాజాపేట, జాల, కొండమడుగు, చీమలకొండూరు, వీరవెల్లి, కొండమడుగు గ్రామాలతో పాటు మరిన్ని గ్రామాల్లో నివసించారు. కాగా స్వాతంత్ర్యం అనంతరం కొందరు తిరిగి వెళ్లిపోగా, ఇంకొందరు ఈ ప్రాతంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
నిజాం కాలంలో ఈ ప్రాంతంలో రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేశారు. ప్రజల మానప్రాణాలను కాపాడుతూ ముష్కర రజాకార్ల(Mushkara Rajakarla) చేతుల్లో ఎందరో బలయ్యారు. రాజ వంశీయులుగా పిలువబడే క్షత్రియ రాజపుత్రులు ఆయా గ్రామాల్లో పటేల్, పట్వారీలుగా గ్రామ ప్రజలతో మమేకమై వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొందరు ఆర్థిక ఇబ్బందులతో బతుకుదెరుపు కోసం హైదరాబాద్ కు వలస వెళ్లారు.
కొనసాగిస్తున్న ఆచార కట్టుబాట్లు..
నేటి కంప్యూటర్ యుగంలో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో క్షత్రియ రాజపుత్రులు తమ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా వివాహాల్లో సంస్కృతి, సంప్రదాయానికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికీ పురాతన, ఆచారాలు కొనసాగిస్తూ సంస్కృతి(Culture), సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.
రాజకిరీటంలా బాసింగం..
పెళ్లి సందర్భంగా వధూవరులు ధరించే బాసింగం రాజకిరీటంలా తయారు చేస్తారు. ఈత ఆకులతో తయారు చేసిన బాసింగాన్ని రంగురంగుల పూలతో అందంగా తీర్చిదిద్దుతారు. ఈ బాసింగం తయారీకి ప్రత్యేక నిపుణులుంటారట. హైదరాబాద్ లోని పాతబస్తీ, కరీంనగర్ జిల్లా(Karimnagar District)లో మాత్రమే వీటి తయారీదారులున్నారు. వివాహానికి పది రోజుల ముందే ఆర్డర్ ఇస్తే.. పెళ్లి రోజు వరకు బాసింగం అల్లుకొని బుట్టలో పెట్టి జాగ్రత్తగా తీసుకొస్తారు. దీనికి సూమారు రూ.10వేల వరకు ఖర్చు అవుతుంది.
ధూంధాంగా బరాత్..
క్షత్రియ రాజపుత్రుల కులస్తులు పెళ్లికి ముందే బరాత్ తీస్తారు. పూర్వీకుల ఆచారం ప్రకారం బరాత్ కు గుర్రాన్ని వాడతారు. సుమారు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు పెట్టి మరీ గుర్రాన్ని అందంగా తీర్చిదిద్దుతారు. రాజకిరీటంలా తయారు చేసిన బాసింగాన్ని వెళ్లి కుమారుడు ధరించి తల్వార్(Talwar) చేత పట్టుకొని గుర్రం పై రాజులా టీవీగా కూర్చుంటారు. గ్రామ వీధుల్లో బాజా, జంత్రీలతో సాగే బరాత్లో చిన్నా,పెద్ద, ఆడ,మగ అనే బేధం లేకుండా నృత్యాలు చేస్తారు. వివాహ వేడుకల్లో బరాత్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీరి బరాత్ చూడడానికి బంధువులు, జనం ఎగబడతారు.
పెళ్లికి ముందే గొడవ..
ఎదురుకోళ్లలో నూతన వధూవరుల బంధువులు అలాయిబలాయి కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తారు. సంప్రదాయంగా బొట్టు పెట్టి పూలమాల వేసి శాలువాలతో ఒకరికొకరు సత్కరించుకుంటారు. అనంతరం బంధుత్వంలో ఇక ముందు ఎలాంటి గోడవలు చోటుచేసుకోకుండా ఉండాలని, వధూవరులతో పాటు వారి బంధువులు పెళ్లికి ముందే గొడవపడి సంప్రదాయంగా బియ్యంతో కొట్టుకుంటారు. వేదపండితుల గాయత్రి మంత్రోచ్చరణల(Mantorchanala)తో వదువుకు ఐదుగురు కలిసి వధువుని జంజనధారణ గావిస్తారు. అనంతరం పెళ్లి పందిరిలోకి సాదరంగా ఆహ్వానిస్తారు.
సంప్రదాయబద్ధంగా పెళ్లి..

పెళ్లి పందిరిలో వధూవరులు ఒకరికొకరు పూలమాలలు వేసుకోగా, పది మంది పెద్దలు అక్షింతలు వేసి ముందే ఆశీర్వదిస్తారు. ప్రత్యేక వేద పండితుడి హిందీ మంత్రోచ్ఛరణ మధ్య సంప్రదాయబద్ధంగా వివాహం జరిపిస్తారు. అనంతరం వధూవరులు కొంగు ముడి వేసుకొని ఏడడుగులు నడిచి మూడు మూళ్ల బంధంతో ఒక్కటై తలంబ్రాలు చల్లుకుంటారు. మిఠాయిలు, శాఖహారం(Sweets, Vegetarian) భోజన విందుతో పెళ్లి తంతు ముగుస్తుంది. అనంతరం వధూవరులను సాగనంపుతారు.
ఘనంగా పెళ్లి వేడుకల నిర్వహణ..
వివాహాలు పూర్వీకుల ఆచారం ప్రకారం జరిపిస్తుంటారు. క్షత్రియ రాజ పుత్రుల కులస్తుల్లో ఆర్థిక ఇబ్బందులున్నా పెళ్లిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. పూర్వీకుల ఆచారం, సంప్రదాయం ప్రకారం వైభవంగా పెళ్లిని జరిపిస్తారు. బంధువుల్లో ఎక్కడ పెళ్లి జరిగినా వెళ్లి సంప్రదాయ బద్ధంగా జరిగే వివాహాన్ని తిలకిస్తారు.

