నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..

నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

రానున్న రెండేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు మున్సిపాలిటీ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ సభలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కారు గుర్తుపై ఓట్లు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి చౌటుప్పల్ మున్సిపాలిటీ పై మరోసారి బీఆర్ఎస్ జండాను ఎగురవేయాలని కోరారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఈనెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలలో బుద్ది చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చౌటుప్పల్‌ ను మున్సిపాలిటీ కేంద్రంగా, ఆర్డీవో డివిజన్‌, విద్యుత్ డివిజన్, కోర్టు, ఎస్ టి ఓ కార్యాలయం, పోలీస్ డివిజన్ కార్యాలయం ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

అలాగే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి అనేక కీలక అభివృద్ధి పనులన్నీ బీఆర్‌ఎస్ హయాంలోనే చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా కనీసం రైతులకు తామిచ్చిన రైతుబంధు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీలు అమలు చేయలేదని ప్రభాకర్ రెడ్డి ఎద్దేవ చేశారు. బీఆర్‌ఎస్, సీపీఎం మిత్రపక్ష పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే చౌటుప్పల్‌ ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి నమ్మిన ప్రజలు మోసం చేసిందన్నారు. రైతులకు రైతుబంధును ఎగ్గొట్టిందని, రుణమాఫీ అందరికీ చేయలేదని, మహిళలకు 2500, స్కూటీలు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి లేదని, పింఛన్ 4 వేలు చేయలేదని, ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వలేదని వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేశం గౌడ్, రామాలయం మాజీ చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, చౌటుప్పల్ పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్ తో పాటు సిపిఎం నాయకులు, పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply