కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి

  • నవీన్ యాదవ్ గెలుపే జూబ్లీహిల్స్ అభివృద్ధికి బాట
  • ఇంటింటి ప్ర‌చారంలో కడియం కావ్య….

హైదరాబాద్ ( జూబ్లీహిల్స్), ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా బోరబండ డివిజన్‌లోని స్వరాజ్ నగర్, రాజ్ నగర్ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె గడపగడపకు తిరుగుతూ, ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేస్తూ, స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేయాలని కోరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం, అభివృద్ధి” అని స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి పనిచేసే కాంగ్రెస్ పార్టీనే జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరిస్తారని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఆ ఇంటికి విద్యుత్ వెలుగులు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ ,మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు.

Leave a Reply