PARK | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్

PARK | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్
బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లు దోచుకుందని కేటీఆర్ ఆరోపణ
టెక్స్ టైల్ పార్క్‌ను సందర్శించిన మాజీ మంత్రి
PARK | గీసుగొండ, ఆంధ్రప్రభ : వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో (At Mega Textile Park) జరుగుతున్నపరిశ్రమ అభివృద్ధిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. కిటెక్స్ కంపెనీలో పరిశ్రమల పనితీరును సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ఆశలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని దుయ్యబట్టారు. గతంలో బీసీ రిజర్వేషన్లు 24 శాతం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ 42 శాతం ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లు దోచుకుందని ఆరోపించారు. కానీ ఇప్పుడు కేవలం 17 శాతానికి మాత్రమే రిజర్వేషన్లు పరిమితం చేయడం బీసీలతో చేసిన తీరని ద్రోహం అని మండిపడ్డారు. చాలా మండలాల్లో ఒక్క బీసీ ప్రతినిధికి కూడా అవకాశం ఇవ్వని విధంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు. బీసీలకు చేసిన మోసానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికలలో పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం మరో మోసమని పేర్కొంటూ, “ఎనుముల రేవంత్ కాదు… అనకొండ రేవంత్” అని రేవంత్ రెడ్డిపై ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కాకతీయ మెగా టెక్సటైల్ పార్క్ పై కూడా కేటీఆర్ స్పందించారు. కేఎల్టీపీ స్థాపన కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. ఒకప్పుడు అజంజాహీ మిల్లుల (Azamjahi Mills) ఆధారంగా అభివృద్ధి చెందిన వరంగల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందని గుర్తుచేశారు. నేతన్నలు ఉపాధి కోసం సూరత్, షోలాపూర్, భివాండి ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 2017లో కేసీఆర్ శంకుస్థాపన చేసిన కేఎమ్ టీపీ ఇప్పుడు పరిశ్రమల హబ్ గా మారుతున్నదని వివరించారు. కైటెక్స్, యంగ్వన్, గణేషా వంటి ప్రముఖ కంపెనీలు పార్కులో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండటం, దాదాపు 25-30 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్న విషయం సంతోషదాయకమని అన్నారు. టెక్స్‌టైల్స్ అత్యాధునిక స్పిన్నింగ్, గార్మెంటింగ్ యూనిట్లను పరిశీలించినట్లు తెలిపారు. యంగ్ వన్ సంస్థకు భారీ స్థాయిలో భూమి కేటాయించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. భూసేకరణకు స్థానిక రైతులను ఒప్పించిన ధర్మారెడ్డికి ప్రశంసలు కురిపించారు.
కేఎమ్ టీపీ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే. కాకుండా దేశానికి కూడా ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పార్క్ విజయాన్ని చూసి కేంద్రం నాలుగేళ్ల తర్వాత పీఎం మిత్ర స్కీంను ప్రకటించిందని తెలిపారు. “తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది” అన్న భావనకు కేఎల్టీపీ నిదర్శనమని అన్నారు. అయితే పార్కులో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయని, కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్లైఓవర్ (ఆర్.ఓ.బీ), డ్రైనేజ్, సివరేజ్ సిస్టమ్, కామన్ ఫెసిలిటీలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం, పార్టీలు మారినప్పటికీ ప్రజల ప్రయోజనం శాశ్వతమని, కేఎల్టీపీ (KLTP) ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వరంగల్ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ, స్థానికులకే ఉద్యోగాలు లభించే విధంగా పార్ను ముందుకు తీసుకెళ్లే పనిలో అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. కేసీఆర్ రూపొందించిన ఈ పారిశ్రామిక దృష్టికోణం, సమగ్ర అభివృద్ధికి దారి తీస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రంలో పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్, గండ్ర వెంకట రమణా రెడ్డి, శంకర్ నాయక్, పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, వాసుదేవ రెడ్డి బి. ఆర్. ఎస్. నాయకలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
