Congress | ఆటో డ్రైవర్ టూ డీసీసీ ప్రెసిడెంట్..

Congress | ఆటో డ్రైవర్ టూ డీసీసీ ప్రెసిడెంట్..

  • ఫలించిన గుడిపాటి నిరీక్షణ..
  • జిల్లా కాంగ్రెస్ పార్టీ సారధిగా గుడిపాటి నర్సయ్య..
  • దామన్న వర్గంలో జోష్..
  • సామాజిక న్యాయం జరిగిందని నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు..

Congress, సూర్యాపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ శనివారం రాత్రి తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన గుడిపాటి నర్సయ్యను నియామకం చేసింది. మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అనుంగు అనుచరుడుగా ఉన్న గుడిపాటి 1994లో జెడ్పీటీసీగా గెలుపొంది, 2009లో తుంగతుర్తి శాసనసభ్యులుగా పోటీ చేసి మోత్కూపల్లి నరసింహులు మీద స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి చెందారు. అప్పటి నుండి శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ మూడుసార్లు భంగపాటుకు గురైన తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా, దామన్న శిష్యునిగా పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుడిపాటి నర్సయ్యను జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

నక్సలైట్ గా పని చేసి జనజీవన స్రవంతిలో కలిసిన గుడిపాటి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆకర్షితుడై దామన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన శిష్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పార్టీలో పని చేస్తూ ఆటో డ్రైవర్ గా తన ప్రస్తానాన్ని కొనసాగించిన గుడిపాటిని 1994లో దామోదర్ రెడ్డి జెడ్పిటీసీగా గెలిపించుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి తుంగతుర్తి శాసనసభ్యులుగా పోటీ చేసి ఓటమి చెందగా 2014లోను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. తర్వాత జరిగిన పరిణామాల్లో టికెట్ అద్దంకి దయాకర్ కు కేటాయించారు. 2019లోనూ పోటీపడగా తిరిగి అద్దంకి దయాకర్ కే టికెట్ ఇచ్చారు. 2023లోను తీవ్రంగా పోటీ పడగా నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిణామాల క్రమంలో బీఆర్ఎస్ (BRS) నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు టికెట్ వరించింది. అయినా.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకునిగా కొనసాగారే తప్పా పార్టీ గీత దాటే ప్రయత్నం చేయలేదు.

మూడుసార్లు భంగపడ్డా…!
చేయాల్సినవన్ని చేసి ఏదో ఒక విషయంలో కొంత అనుకున్న పని జరగకపోతేనే జెండాలు మార్చే ప్రస్తుత రోజుల్లో మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ చేతి దాకా వచ్చి వెనక్కి పోయినా ఆయన నమ్ముకున్న నాయకుడిని పార్టీని వదిలి పెట్టాలని ఆలోచన చేయలేదు కదా… కనీసం బహిరంగ విమర్శ చేయలేదు. ఆ క్రమశిక్షణ నేడు ఆయనను జిల్లా సారాధిని చేసింది అనడంలో అతిశయోక్తి లేదు.

క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా..
తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లి గ్రామానికి చెందిన మల్సూర్ – మల్లమ్మల కుమారుడు గుడిపాటి నర్సయ్య నక్సలైట్ లకు ప్రభావితమై కొన్నాళ్లు అక్కడ పని చేసి తిరిగి జనజీవన స్రవంతిలో కలిసి ఆటో డ్రైవర్ గా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా దామన్నను నమ్ముకున్న శిష్యునిగా పని చేసి జిల్లా అధ్యక్షునిగా నియామకం కావడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దామన్న వర్గంలో జోష్..
మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి (Dhamodhar Reddy) రెండు నియోజకవర్గాలోని పార్టీలో అసాధారణ అభిమానులు ఉన్నారు. ఆయన మరణం తర్వాత పార్టీలో ఆయన కుటుంబానికి ప్రాధాన్యం తగ్గుతుందనే నైరాష్యం కొంత ఆయన వర్గంలో ఉండేది. కానీ ఆయన సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు మాట్లాడి ఆయన కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతు ప్రకటించడంతో పాటు ఎస్సారెస్పీ ఫేస్ 2 కాల్వకు ఆయన పేరు ప్రకటించడమే కాకుండా వెనువెంటనే జీవో విడుదల చేయడం, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన శిష్యుడైన గుడిపాటికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఆయన వర్గ నేతలకు జోష్ వచ్చినట్లయింది.

Leave a Reply