కత్తులతో 52 మందిని నరికి చంపిన తిరుగుబాటుదారులు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆఫ్రికా దేశమైన కాంగో(Congo)లో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. కత్తులు, గొడ్డళ్లతో 52 మందిని నరికి చంపేశారు. ఈవిషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. కాంగో దళాల చేతిలో ఓటమి పాలవడంతో రగిలిపోయిన అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అక్కడి అధికారి తెలిపారు. బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరులపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. నిద్రపోతున్న ప్రజలను లేపి.. తాళ్లతో చేతులు కట్టి కత్తులు, గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికి చంపారన్నారు. మెలియా గ్రామంలోనే దాదాపు 30 మంది ప్రాణాలు తీశారన్నారు. ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఇళ్లకు కూడా నిప్పంటించారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఓ క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇస్లామిక్ స్టేట్‌తో ముడిపడి ఉన్న తిరుగుబాటు సంస్థ ఏడీఎఫ్. ఈ సంస్థ ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పౌరులే లక్ష్యంగా కొన్నేళ్లుగా దాడులకు పాల్పడుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 6వేల మందికి పైగా బలిగొన్నట్లు నివేదికలు ఉన్నాయి. ఏడీఎఫ్‌పై అమెరికా, ఐరాస భద్రతామండలిలు ఆంక్షలు విధించాయి.