Condolence | విల‌క్ష‌ణ న‌టుడు కోట మృతికి రేవంత్, చంద్ర‌బాబు సంతాపం..

అమ‌రావ‌తి హైద‌రాబాద్ / విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (kota srinivasarao ) ఈ ఉదయం కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (ap cm Chandrababu, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (telangana cm Revanth reddy ఎపి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (nara lokesh ) సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు మరణం విచారకరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయమన్నారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు: రేవంత్‌రెడ్డి
కోటా శ్రీనివాసరావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఆయన తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోటకు ప్రత్యేకస్థానం.. నారా లోకేశ్

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని నారా లోకేశ్ పేర్కొన్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారని, ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.

కోట సినీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం: తనికెళ్ల భరణి (Tanikella bharani)
కోటా శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.. ఆయన మృతితో సినీ పరిశ్రమ ‘కోట’ కూలిపోయిందని పేర్కొన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నాటకాలపై ఉండే ఎనలేని ఆసక్తే ఆయన సినీ రంగ ప్రవేశానికి దారులు వేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.

నమ్మలేకపోతున్నా: బ్రహ్మానందం (Brahmanandam )
కోటా శ్రీనివాసరావు లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. నటన ఉన్నంతకాలం ఆయన ఉంటారని పేర్కొన్నారు. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి అని కొనియాడారు. నాలుగు దశాబ్దాలపాటు తాము కలిసి పనిచేశామని బ్రహ్మానందం గుర్తుచేసుకున్నారు. కోటా శ్రీనివాసరావును చూస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నుంచి నేర్చుకుంటూ పెరిగానని ప్రముఖ నటుడు రవితేజ అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలు తనకు మధుర జ్ఞాపకాలన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a Reply