వెలగపూడి – ఆరు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వనజీవి రామయ్య మరణం తీరని లోటని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వనజీవి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
‘పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం. తన జీవిత కాలంలో సుమారు కోటి మొక్కలు నాటారు. ఆయన కన్నుమూశారని తెలిసి చింతించా. వృక్షో రక్షతి రక్షిత: అనే పెద్దల మాటలోని వారసత్వాన్ని ప్రజలకు తెలియజేసేందుకు రామయ్య పడిన తపన సమాజానికి ఎంతో మేలు చేస్తోంది. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటుతూ, విత్తనాలు జల్లుతూ పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వనయజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుంది. ఓసారి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న రామయ్యను పరామర్శించా. అప్పుడు కూడా ఆయన పర్యావరణ పరిరక్షణపైనే మాట్లాడారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు కృషి చేస్తాం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తాం’’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.