అక్రమ ఇసుక రవాణాపై ఆందోళన

అక్రమ ఇసుక రవాణాపై ఆందోళన

  • రాత్రి వేళల్లో పెరుగుతున్న ఇసుక రవాణా..
  • చర్యలు కోరుతున్న గ్రామస్తులు

వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామంలో రాత్రి వేళల్లో ఇసుక రవాణా పెరుగుతోందన్న సమాచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత ఇసుక వాహనాల రాకపోకలు ఎక్కువవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భీంగల్ మండలంలోని బడా భీంగల్ ప్రాంతం నుండి సాయంత్రం తర్వాత ఇసుక రవాణా జరుగుతుందనే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుండి వేల్పూర్ మండలం మీదుగా ఆర్మూర్ నియోజకవర్గం వైపు వాహనాలు వెళ్లుతున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

ఈ వ్యవహారంపై సంబంధిత శాఖలు మరింత పర్యవేక్షణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం చట్టబద్ధ విధానాల ప్రకారం ఇసుక రవాణా నిర్వహించాలనే సూచనలు ఇస్తుండగా, కొన్ని చోట్ల అనుమానాస్పద రవాణా జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అక్లూర్ గ్రామంలో స్థానిక అవసరాలకు సరిపడా ఇసుక అందుబాటులో లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గృహ నిర్మాణాల కోసం ఇసుక దొరకక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కొన్ని వాహనాలను గ్రామస్తులు నిలిపి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

వాహనాలను అనంతరం వేల్పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సర్పంచ్ జనార్ధన్ మాట్లాడుతూ, గ్రామంలో అనుమానాస్పద ఇసుక రవాణాపై అప్రమత్తంగా ఉంటామని, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నామని తెలిపారు. గ్రామస్తులు, వీడీసీ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply