Competitions | పతకాల పంట

Competitions | పతకాల పంట

  • గుంటూరు పోలీసుల‌కు మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 18 పతకాలు
  • సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్

Competitions | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : 44వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2025లో గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 18 పతకాలు (14 గోల్డ్, 3 సిల్వర్, 1 బ్రాంజ్) సాధించి జిల్లా పోలీస్ విభాగానికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చారు. నెల్లూరు జిల్లా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో గుంటూరు జిల్లా పోలీస్ విభాగానికి చెందిన ముగ్గురు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు కలిపి మొత్తం ఆరుగురు సిబ్బంది పాల్గొన్నారు. 35 నుండి 60 ఏళ్ల వయస్సు విభాగాల్లో పరుగు, రేస్ వాక్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, హ్యామర్ త్రో, హైజంప్, హర్డిల్స్ వంటి విభిన్న క్రీడా విభాగాల్లో పోటీ పడి పతకాలు సాధించారు.

పతకాలు సాధించిన పోలీస్ సిబ్బంది శనివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందిస్తూ, పోలీస్ విధుల్లో నిత్యం బిజీగా ఉంటూ కూడా క్రీడలపై ఆసక్తి చూపుతూ, ముఖ్యంగా 50–60 ఏళ్ల వయస్సులోనూ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని పతకాలు సాధించడం గర్వకారణమని ప్రశంసించారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

పతకాలు సాధించిన వారు..

  • జి. కృష్ణ కిషోర్, హోంగార్డు, 5 కి.మీ రేస్ వాక్ – గోల్డ్, 5 కి.మీ పరుగు – గోల్డ్, 800 మీ. పరుగు – గోల్డ్
  • కె. రాజశేఖర్ బాబు, ఏఎస్ఐ, నల్లపాడు పీఎస్- 5 కి.మీ వాక్ లో గోల్డ్, 5 కి.మీ పరుగులో గోల్డ్, 800 మీ. పరుగులో గోల్డ్
  • మహమ్మద్ షాహెదుల్లా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ – డిస్కస్ త్రో లో గోల్డ్, షాట్‌పుట్ లో గోల్డ్, హైజంప్ లో గోల్డ్
  • ఎం. లక్ష్మయ్య, హెడ్ కానిస్టేబుల్, ఫింగర్ ప్రింట్ బ్యూరో – డిస్కస్ త్రో లో గోల్డ్, షాట్‌పుట్ లో గోల్డ్, హ్యామర్ త్రో లో గోల్డ్
  • ఎం. సాంబశివరావు, ఏఎస్ఐ, చేబ్రోలు – హైజంప్ లో గోల్డ్, 100 మీ. హర్డిల్స్ లో గోల్డ్, 800 మీ. పరుగులో బ్రాంజ్
  • ఐ.ఆర్. చంద్రశేఖర్, ఏఆర్ ఏఎస్ఐ – డిస్కస్ త్రో లో సిల్వర్, హ్యామర్ త్రో లో సిల్వర్, షాట్‌పుట్ లో సిల్వర్

Leave a Reply