Company |భారీ పేలుడు.. ఒకరు మృతి..

Company |భారీ పేలుడు.. ఒకరు మృతి..

వి జే సాయి ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, ఒకరు మృతి మరి కొందరికి గాయాలు
పేలుడుకు ముందు రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కెమిస్ట్ దార పవన్
ఘటన స్థలాని పరిశీలించిన ఆర్డిఓ శేఖర్ రెడ్డి, డి ఎస్ పి మధుసూదన్ రెడ్డి లు
తరచుగా పరిశ్రమలలో పేలుడు సంఘటనలు
భయాందోళనలో పరిశ్రమల పరిసర గ్రామాల ప్రజలు

Company | చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. శివారులో ఉన్న వీ జే సాయి ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి.. ఈ పరిశ్రమలో పని చేస్తున్న కెమిస్ట్ దార పవన్ మంటల్లో బూడిద కాగా మరికొంతమందికి గాయాలైయ్యాయి. మధ్యాహ్నం సమయంలో పరిశ్రమలో పనిచేసే కార్మికులతో పాటు లంచ్ చేయడం కోసం తనతో పాటు పనిచేసే కెమిస్ట్ కృష్ణాచారి కూడా వెళ్లగా కెమిస్ట్ పవన్ పరిశ్రమలోని రియాక్టర్ వద్ద పనిచేస్తున్నారు.

డ్రమ్ముల నుండి రియాక్టర్ లోకి ట్రోలిన్ రసాయనాన్ని లోడ్ చేస్తుండగా ఊహించని విధంగా పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు లేచాయి. డ్రమ్ముల నుండి రియాక్టర్ లోకి లోడ్ చేస్తున్న ధార పవన్ మంటల్లో కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. దాని సమీపంలో పనిచేస్తున్న మరి కొంతమంది కార్మికులు కూడా గాయపడినట్లుగా తెలిసింది. మృతదేహం కాలిపోవడం వల్ల సంఘటన స్థలం నుంచి బయటకు తీసుకురాలేదు. అధికారులు మృతుని కుటుంబ సభ్యులను సంఘటన స్థలానికి తీసుకువెళ్లి పవన్ మృతదేహాన్ని గుర్తించారు. రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించిన విషయాన్ని తెలుసుకున్న చౌటుప్పల్ ఆర్డిఓ వెలమ శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ డి ఎస్ పి పటోళ్ల మధుసూదన్ రెడ్డి తదితర అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సంబంధించిన వివరాలను తెలుసుకొని, పేలడానికి గల కారణాలు విచారిస్తున్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన మృతుడు పవన్ నువ్వు ఎనిమిది నెలలకు క్రితమే పరిశ్రమంలో చేరాడు. అతనికి భార్య సౌజన్య, చిన్న కుమారుడు, కూతురు ఉన్నారు. చౌటుప్పల్ లో భార్య, పిల్లలతో నివసిస్తూ పరిశ్రమలో పనిచేసి కుటుంబాన్ని పోషించే పవన్ ప్రమాదంలో మరణించడంతో కాలిపోయి ఉన్న భర్త మృతదేహాన్ని చూసిన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు, వారి దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోయారు.

తరచుగా రసాయన పరిశ్రమలలో పేలుడు సంఘటనలు
భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు

చౌటుప్పల్ డివిజన్ లోని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడెం, తంగడపల్లి, లింగారెడ్డిగూడెం, తాళ్లసింగారం, అంకిరెడ్డి గూడెం, పంతంగి, ఎస్ లింగోటం, జై కేసారం, మందోల్లగూడెం, బి నాగారం, కొయ్యలగూడెం, ధర్మోజీ గూడెం, ఎల్లగిరి, మల్కాపురం, పోచంపల్లి మండలంలోని దోతిగూడెం అంతమ్మ గూడెం గ్రామాలలోని కాకుండా బీబీనగర్ మండలంలో కూడా ఇష్టానుసారంగా రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో రసాయన పరిశ్రమలపై పర్యవేక్షణ లోపించి పరిశ్రమలలో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల కాలంలో జై కేసారం లోని ఎస్ ఆర్ లాబరేటరీస్ పరిశ్రమలో రాత్రి సమయంలో భారీ పేలుడు సంభవించి మంటల్లో పరిశ్రమ తగలబడింది. రాత్రి సమయం కావడంతో కార్మికులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. అదేవిధంగా ఎల్లగిరి గ్రామ శివారులో ఉన్న బృందావన్ లాబరేటరీస్ లో గత శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంబంధించింది. రియాక్టర్ పేలి పరిశ్రమ భవనం గోడలు పూర్తిగా అయిపోయాయి. ఈ పేలుడు వల్ల పలువురు కార్మికులు గాయపడ్డారు. వారం తిరక్క ముందే మరో పేలుడు సంభవించడంతో పరిశ్రమల పరిసరాలలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

రసాయన పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లనే ఇటువంటి పేలుడు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని, గాయపడుతున్నారని, ఈ సంఘటనలపై సంబంధిత శాఖల ఉన్నత అధికారులు విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని పరిసర గ్రామాల ప్రజలు, కాలుష్యం బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విజే సాయి పరిశ్రమలో పేలుడు సంభవించి ఒకరు మరణించినప్పటికీ పీసీబీ ఉన్నతాధికారులు పరిశ్రమకు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.

Leave a Reply