బాలలపై దాడులు ఆందోళనకరం..

బాలలపై దాడులు ఆందోళనకరం..
వారి భద్రతకు సమాజం బాధ్యత వహించాలి
– డా. పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, ఆంధ్రప్రభ : బాలలపై పెరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వారి భద్రతను సమాజం బాధ్యతగా తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం బాలల హక్కుల పరిరక్షణ, బాలల పై జరిగే నేరాల నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలల భద్రత, చట్టాల అమలు, అవగాహనపై పలు ముఖ్య విషయాలను వెల్లడించారు. 2023 సంవత్సరానికి సంబంధించిన డేటా ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల కేసులు చిన్నపిల్లలపై నమోదయ్యాయని పేర్కొన్నారు. నమోదైన కేసుల్లో 45% అపహరణలు (కిడ్నాపింగ్), 38% పోక్సో కేసులు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 192 కేసులు లైంగిక నేరాలకు సంబంధించినవి నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తపరిచారు.
జరిగే నేరాల్లో 96% కేసుల్లో నేరస్తులు పిల్లలకు తెలిసిన వ్యక్తులే ఉంటారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో బాలలపై నేరాలకు సంబంధించిన 1.93 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. కన్విక్షన్ రేటు కేవలం 32% మాత్రమే ఉండటం ఆందోళనకరమని తెలిపారు. బాల బాలికల పై జరిగే నేరాల విషయంలో అవగాహన పెంచడం అత్యంత అవసరమని తెలిపారు. చైల్డ్ లేబర్ సమస్య కూడా తీవ్రమైనదని, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 55% బాల కార్మికులు ఉన్నారని చెప్పారు.
బాలలపై నేరాలు జరిగాయని తెలిసినా ఫిర్యాదు చేయకపోవడం కూడా చట్టపరంగా నేరమేనని స్పష్టం చేశారు. స్కూల్ స్థాయిలో యూనివర్సల్ స్క్రీనింగ్, హోమ్ విజిట్స్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని చెప్పారు. చిన్నపిల్లలు తమ హక్కుల కోసం పోరాడలేరు కాబట్టి సమాజం వారి భద్రతకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి శ గుమ్మడి సంధ్యారాణి గారు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, సూర్యకుమారి, వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఆన్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్కూల్ సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ షైస్టా కే షా, చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు, స్పెషల్ జువెనైల్ పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, పేరెంట్ కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలల నుండి వచ్చిన రీజినల్ జాయింట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
