(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్ర ప్రభుత్వ అధికార పండుగగా నిర్వహిస్తున్న దసరా (Dasara) శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరపున ప్రత్యేక ఆహ్వానాన్ని అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దుర్గగుడి ఈవో శీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బృందం మంగళవారం కలిసి ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈసందర్భంగా 11 రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్ (Special brochure) ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. దసరా ఉత్సవాల (Dussehra celebrations) కు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి పనుల పురోగతితో పాటు పలు విషయాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఆలయ ప్రతిష్ట మరింత పెంచడంతో పాటు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా ఉత్సవాలను నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.


